ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రాజెక్టుల ట్రెండ్ నడుస్తోంది. ఏపీలో ఏ నేత మాట్లాడినా ఇప్పుడు.. ఏదో ఒక ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు. ప్రతిపక్షనేత జగన్ పెండింగ్ ప్రాజెక్టుల యాత్ర పూర్తి చేశాడు. 

మరోవైపు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ.. రాయలసీమ ప్రాజెక్టుల పరిశీలన చేపట్టారు. ఇక అధికారప్రతిపక్షనేతలు అటు పట్టిసీమకు అనుకూలంగానో.. ప్రతికూలంగానో మాట్లాడుతూ రోజులు గడిపేస్తున్నారు. పట్టిసీమ ప్రారంభిస్తే.. పోలవరం ప్రాజెక్టు పక్కకు వెళ్లినట్టేనని ప్రతిపక్షనేత జగన్ గట్టిగా చెబుతున్నారు. 

జగన్ తన వాదనకు అనుకూలంగా అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. పట్టిసీమ ప్రారంభమైతే.. ఎగువ రాష్ట్రాల నుంచి నీళ్లు రావని.. స్టోరేజీ లేకుండా వందల కోట్లు ఖర్చు పెట్టడం దండుగని చెబుతున్నారు. ఆయన ప్రాజెక్టుల యాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా.. ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీని చీల్చి చెండాడారు. 

పట్టిసీమ ప్రాజెక్టు పునాది టీడీపీకి సమాధిగా మారబోతోందని అంబటి అంటున్నారు. జగన్ చేపట్టిన ప్రాజెక్టుల యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అంబటి చెప్పుకొచ్చారు. 300 కోట్ల ముడుపులకు కక్కుర్తి పడి ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు.. టీడీపీకి శనిగా మారుతుందని అంబటి శాపం పెట్టారు. మరి అంబటి శాపం ఫలిస్తుందా.. టీడీపీ మిగిలిన నాలుగేళ్ల పాలనలో పోలవరం పూర్తి చేసి.. ఆ శాపాన్నుంచి తప్పించుకోగలుగుతుందా.. కాలమే తేల్చాల్సిన ప్రశ్న ఇది.



మరింత సమాచారం తెలుసుకోండి: