రాజధానికి అమరావతి పేరును ప్రకటించడం పట్ల ఆ ప్రాంత ప్రజల్లో వ్యక్తమైన ఆనందం క్రమంగా ఆవిరవుతోందనే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. రాష్ట్రప్రభుత్వం భూ సమీకరణ చట్టాన్ని రెండవ దశలో అమరావతి ప్రాంతానికి అన్వయించే అవకాశముందనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో భూ సమీకరణను ప్రయోగించి 33 వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన విషయం తెలిసిందే. మెట్ట ప్రాంత రైతుల మినహా మిగిలిన వారంతా భయాందోళనకు గురై భూములిచ్చామనే భావనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం స్వచ్చంధంగా రైతులు భూములిచ్చారని ప్రచారం కొనసాగించింది. అంతేకాకుండా భూములు ఇవ్వని రైతుల నుంచి భూ సేకరణ విధానంలో సేకరిస్తామని పదే పదే ప్రకటిస్తోంది. ఇప్పటికీ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కె నారాయణ భూ సేకరణ విధానాన్ని త్వరలో అమలు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. భూ సమీకరణే రైతులకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుందని మంత్రులు అంటున్నారు. 2చట్టాలకు భూములు అప్పగించని పక్షంలో వారి నుంచి భూములు తీసుకోబోమని, అయితే ఆ భూములున్న ప్రదేశాలను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తామని చెప్పడం కూడా నిత్యం కొనసాగుతున్నదే. రెండవ దశ పూలింగ్ అమరావతిలో చేపట్టే అవకాశాలున్నాయని రైతులు చర్చిస్తున్నారు.

ముఖ్యంగా అమరావతి నివాసయోగ్యమైన ప్రదేశంగా ఉండటంతో భూ సమీకరణ వల్ల నష్టపోతామనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని ప్రకటన తర్వాత పూర్తిగా పడిపోవడం కూడా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వారిని కుంగదీస్తోంది. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని ప్రాంతంలో పుంజుకోకపోవడంపై పెద్ద ఎత్తున రైతులు, వ్యాపారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి కూడా రైతులు ఈ సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వం రైతుల మాట సావధానంగా విని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అమరావతి, తాడికొండ ప్రాంతాల్లో అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఈ వ్యవహారం మూడ్నాళ్ల ముచ్చటగా కొనసాగింది.7,200 కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతం విస్తరించి ఉంటుందని ప్రకటిస్తున్న నేపథ్యంలో రెండో విడత పూలింగ్‌లో ఖచ్చితంగా అమరావతి ఉంటుందనే విశ్వాసం అందరిలో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: