చిత్తూరు ఎన్ కౌంటర్ చంద్రబాబు ప్రభుత్వానికి మాయని మచ్చగా మారనున్నాయా.. ఆయన పాలనలో ఇదో చీకటి అధ్యాయంగా మిగులుతుందా.. జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రతిష్ట మసకబారుతుందా.. ?


తాజాగా మానవహక్కుల సంఘం చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమేననిపిస్తోంది. శేషాచలం ఎన్ కౌంటర్ ఘటనలో న్యాయవిచారణకు ఆదేశించకపోవటంపై హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ మానవహక్కుల కమిషన్ ఫుల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎదురుకాల్పుల ఘటనపై విచారణ నిర్వహించాల్సిన తీరు ఇదికాదంటూ ఎన్ హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ బాలకృష్ణన్ నేతృత్వంలోని ఫుల్ బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

ఎన్ కౌంటర్ ఘటనలప్పుడు జ్యుడీషియల్ విచారణ జరపాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ ఎందుకు ఆదేశించలేదంటూ జస్టిస్ బాలకృష్ణన్ ఏపీ అధికారులను నిలదీశారు. ఎన్ కౌంటర్ ఘటన తీరుకు సంబంధించిన సమాచారాన్నంతా ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది. 


జాతీయ మానవహక్కుల కమిషన్ ఫుల్ బెంచ్ ఎదుట ఏపీ పోలీసు విభాగం తరపున ఉన్నతాధికారులు తమ వాదన వినిపించారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు వివరించారు. దొంగల దాడిలో 11 మంది పోలీసు, అటవీశాఖకు చెందిన సిబ్బంది ఎర్ర చందనం దొంగలు జరిపిన దాడిలో గాయపడ్డారని వివరించారు. ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరపాల్సివచ్చిందని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: