ఆంధ్రాజనం ఎంతగానో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా రానట్టేనా.. ? నమ్ముకున్న మోడీ ఆంధ్రాను నట్టేట ముంచేశారా..? టీడీపీ- బీజేపీ కలిస్తే ఇక ఆంధ్రా అభివృద్ధి పరుగో పరుగు అన్న నేతల మాటలు నీటి మూటలుగా మిగిలినట్టేనా.. ? ఇప్పుడు ఇవే ప్రశ్నలను ఆంధ్రాజనాన్ని వేధిస్తున్నాయి. 




రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇప్పటివరకూ ఎటూ తేల్చని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు డైరెక్టుగానే హోదాపై ఆశలు వదులుకోవాలని చెప్పేస్తోంది. హోదా ఇవ్వలేమని ఇంతకంటే ఎలా చెబుతాం.. మీరే అర్థంచేసుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. శుక్రవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలకు సంబంధించిన ఎంపీలు కొత్తప్రభాకర్‌రెడ్డి, మాగంటిబాబు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకోవచ్చని ప్రణాళికశాఖ మంత్రి రావుఇంద్రజిత్‌సింగ్‌ స్పష్టం చేశారు.

జాతీయ అభివృద్ధి మండలి గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాలు సహా ప్రస్తుతం పదకొండు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగి ఉన్నాయని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు బిహార్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం వినతులు వచ్చినట్లు ఆయన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 14వ ఆర్ధిక సంఘం... రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కేటాయింపులు పెంచిందని సమాధానంలో పేర్కొన్నారు. 



తెలుగు రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పిన ఇందర్ జిత్ సింగ్.. ఇక వాటితోనే సరిపెట్టుకోవాలని చెప్పకనే చెప్పేశారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఆర్ధికాభివృద్ధి, పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు... ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించారు.  ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో రావు ఇంద్రజిత్‌ ఇచ్చిన సమాధానం  నిరాశనే మిగిల్చింది. ఐతే.. ఇది మరీ ఊహించని ట్విస్టేం కాదు.. కొన్నిరోజులుగా కేంద్రం నుంచి వెలువడుతున్న సంకేతాలు.. హోదాపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: