పార్లమెంటుకు కూతవేటుదూరంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకున్న‌ రాజస్థాన్‌కుచెందిన ఒక రైతు మృతదేహాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తున్నది? భూ సేకరణచట్టంలో మార్పు చేయడానికి నిరసనగా ప్రదర్శన సాగుతున్నసందర్భంలో ఆత్మహత్యచేసుకున్న విషాద ఘటన దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు అద్దంపడుతోంది. ఒక‌వైపు రాజస్థాన్‌లో రైతు మృతదేహానికి దహన కార్యక్రమాలుజరుగుతుండగా, మ‌రోవైపు ఢిల్లీ నగరవీధుల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలనుతగులబెట్టిన దృశ్యాలను ఎలా అర్ధం చేసుకోవాలి? రైతు మరణానికి కారకులుఆమ్‌ ఆద్మీ నాయకులేనంటూ రాజస్థాన్‌లోని ఆ రైతు బంధువులూ, ఆమ్‌ ఆద్మీకార్యకర్తలేనంటూ సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రి తీర్మానించిన తరువాతప్రశ్నలూ, సమాధానాల అవసరం ఇక రాదు. ఈ సంక్షోభానికి దేశాన్ని పాలించిన,పాలిస్తున్న అన్ని పార్టీలు బాధ్యత గా వ్య‌వ‌హ‌రించాలి.


కేజ్రివాల్ రాజీనామా


రైతులను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగామార్చడం ఎట్లా అనేది ఇప్పుడున్న ప్రధాన సమస్య. ఢిల్లీ నడిబొడ్డున ఒక రైతుఆత్మహత్య చేసుకున్నప్పుడైనా ఈ రాజకీయ పక్షాలు ఈ సమస్య గురించి నిజాయితీతోచర్చ జ‌ర‌గాలి. కానీ రైతు ఆత్మహత్యను కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే చిల్లర రాజకీయమే సాగుతున్నది. రైతును ఎందుకు కాపాడలేదంటూఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులను తప్పు పడుతున్నది. బీజేపీపై కూడా నిప్పులుకురిపిస్తున్నది. ఆప్ నాయకులను అరెస్టు చేయాలని బీజేపీ కార్యకర్తలుఆందోళనకు దిగారు. కేజ్రివాల్ రాజీనామా చేయాలంటూ యూత్‌కాంగ్రెస్ ఊరేగింపుతీసింది. దేశాన్ని పీడిస్తున్న మౌలిక సమస్యను గుర్తించకుండా ఇంతగా పరస్పరదాడులకు దిగడం బాధ్యతారాహిత్యమే.


విమర్శలు, ప్రతివిమర్శలు, వ్యంగ్యవ్యాఖ్యలతో ఈ యువ రైతు విషాద మరణం పట్లఅమానవీయంగా ప్రవర్తిస్తున్నారు నాయకులు. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య నడిచినవాగ్యుద్ధాలు అంటుంచితే, ఒక ప్రత్యామ్నాయ రాజకీయపక్షంగా, సామాన్యుడిపక్షాన నిలిచే పార్టీగా పేరున్న ఆప్‌ నాయకుల నుంచి వ్యంగ్యవ్యాఖ్యలురావడం ఊహించనిది. కిసాన్‌ ర్యాలీని భగ్నం చేసేందుకు బీజేపీ పన్నినకుట్రగా ఈ సంఘటనను అభివర్ణించడం, కార్యకర్తలకు చెట్లు ఎక్కడంలో శిక్షణలేనందువల్లే రైతును రక్షించడంలో విఫలమయ్యారనడం ఆత్మరక్షణలో భాగమనిసరిపుచ్చుకోలేనివి. కార్యకర్తలు రైతు గజేంద్రను ఆత్మహత్యకుప్రోత్సహించారనీ, రెచ్చగొట్టారనీ, నాయకులు అతడిని కాపాడటానికిప్రయత్నించలేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులకు ఆగ్రహంకలగడం సహజమే కానీ, స్పందించే తీరు ఇది ఎంతమాత్రమూ కాదు. ‘అసలు ఇదికేజ్రీవాల్‌ తప్పు. ఆయన తక్షణమే ప్రసంగాన్ని ఆపి ఆ రైతునురక్షించాల్సింది. ఇకనుంచి చెట్లు ఎక్కి అందరినీ రక్షిస్తారు’ అంటూవ్యంగ్యంగా వ్యాఖ్యానించడం ఆప్‌ నాయకులకు రాజకీయ పరిణతి రాలేదనడానికినిదర్శనం.


1990 దశకంలో ప్రపంచీకరణ విధానాలు మొదలైన తరువాత ఇప్పటి వరకుదేశవ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆంచనా.ఇప్పటికీ సగటున గంటకు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరోవైపువ్యవసాయంపై సబ్సీడీలు ఎత్తివేయాలని పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడివస్తున్నది. హరిత విప్లవ విషఫలాలు, అంతర్జాతీయ పోకడలు రైతునువెంటాడుతున్నాయి. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడడానికి అంతర్జాతీయ కారణాలుఉన్నాయి. మన పాలకుల విధానాలు కూడా ఈ సంక్షోభానికి తోడయ్యాయి.


ప్రాణం పోవడానికి కారణాలు తేలుస్తాయి కానీ


బీజేపీ భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ వేలాదిమందితోనిర్వహిస్తున్న సభలో ఎటువంటి వాతావరణం ఉంటుందో ఊహించవచ్చు. ఆ హోరులో రైతుచెట్టుమీద నుంచి చేస్తున్న హెచ్చరికలు ఏమిటో సరిగా అర్ధం కాకపోవచ్చు,లేదా వాటిని బేఖాతరుచేసి ఉండవచ్చు. చెట్టుకు వేలాడుతున్న రైతును కిందకుదించుతున్న దృశ్యాల్లో కార్యకర్తలే ఉన్నారు కానీ, కాపాడబోయిన పోలీసులుకనిపించలేదు. అకాల వర్షాలు కురిసినంత మాత్రాన ఓ యువరైతు బతుకుతీపినిచంపేసుకుని అకాల మరణానికి ఎందుకు ఒడిగట్టవలసిందో ఆ దర్యాప్తులు చెప్పవు.ప్రాణం పోవడానికి కారణాలు తేలుస్తాయి కానీ, ఉసురు తీసుకోవడానికిదారితీసిన పరిస్థితులను శోధించవు.


రైతన్నతో పాటు, అవమానాన్ని కూడా నిస్సిగ్గుగా వదిలేసిన ఈ దేశంలోబలవన్మరణానికి పాల్పడిన లక్షలాది మందిలో గజేంద్ర చేరిపోయాడు. ప్రాణం కంటేవిలువైనది ఇంకేముంటుంది అంటూనే ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న ప్రభుత్వాలనుఅతడు సరిగానే అర్ధం చేసుకున్నాడు. తనను అగాధంలోకి లాగుతున్న పరిస్థితులనుంచి మోక్షాన్ని ప్రసాదించే నాథుడు రానే రాడని పిన్నవయసులోనే గుర్తించినగజేంద్రుడు, ఏ ప్రార్థనలూ చేయకుండానే విముక్తిమార్గాన్ని ఎంచుకున్నాడు.


దేశంలోని డెబ్బయి ఆరు శాతం రైతులు వేరేప్రత్యామ్నాయం


కొద్ది కాలం కిందట ఒక సామాజిక శాస్త్ర అధ్యయన కేంద్రం వారు వ్యవసాయసంక్షోభంపై పరిశీలన జరిపారు. దేశంలోని డెబ్బయి ఆరు శాతం రైతులు వేరేప్రత్యామ్నాయం దొరికితే వ్యవసాయాన్ని వదిలిపెడతామని చెప్పుకున్నారట. అరవైఒక్క శాతం రైతులు నగరాలకు వలస పోయి ఉపాధి పొందాలని భావిస్తున్నారట. తమభవిష్యత్తు అంధకారంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారనడానికిసర్వేలు కూడా అవసరం లేదు. కరువు, వరదలు, అకా ల వర్షాలు, చీడ పట్టడం,గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అనేక కారణాలు రైతును కుంగదీస్తున్నాయి.


నీటి ప్రాజెక్టులన్నీ త్వరిత గతిన పూర్తి చేసి నదీ జలాలను వినియోగంలోకితేవడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జ‌ర‌గాలి. రైతులకు భూసార పరీక్షచేయించి పంటలను సూచించడం, రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా అభివృద్ధిచేయడం, రహదారుల వ్యవస్థను పటిష్టం చేసి పల్లెలను మార్కెట్‌కు అనుసంధానంచేయడం మొదలైన చర్యలు వ్యవసాయ రంగాన్ని మెరుగు పరుస్తాయి. పండ్లు, పూలు,కూరగాయల ద్వారా, పాడి పశువుల పెంపకం ద్వారా గ్రామీణ ప్రాంతాన్నిసౌభాగ్యవంతం చేయడానికి కొంత కాలం పడుతుంది. ఇందుకు సమాజాన్ని సమాయత్తంచేసే బాధ్యతను చైతన్యవంతమైన పౌర సమాజం, రాజకీయ పార్టీలు స్వీకరించాలి.అంతే తప్ప రైతు ఆత్మహత్యలను రాజకీయం చేయడం ద్వారా లబ్ధి పొందాలనుకోవడంవల్ల ఫలితం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: