చంద్రబాబు నాయుడు గారికి.. ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తనకు అపారమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్నాయని ఒక విశ్వాసం. ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏకంగా అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన రికార్డు వున్న నాయకుడికి ఆ మాత్రం సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ బిల్డ్‌ కావడంలో వింతేమీ లేదు. కాకపోతే.. ఇప్పటికీ ఆయన తన మనుషుల ద్వారా ప్రజల్ని బురిడీ కొట్టించాలనే చూస్తున్నారు. 


కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మడమతిప్పేసి.. ఆశ పెట్టుకున్న ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచేసినట్టేనని పసిపిల్లలకు కూడా అర్థమైపోతోంది. ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధానికి కూడా తావు లేకుండా దీని గురించి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్రమంత్రులు (ఒక్క వెంకయ్య నాయుడు తప్ప) ‘కావలిస్తే సాయం చేస్తాం.. హోదా కుదర్దు’ అనే మాటలే చెబుతున్నారు. తాజాగా లోక్‌సభలో కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ కూడా దీన్ని తేల్చిచెప్పేశారు. ఆంధ్రప్రదేశ్‌ సంగతేంది బాబూ.. ఆంధ్ర, తెలంగాణల్తో పాటూ.. ఇంకా ఏయే రాష్ట్రాలు దేశంలో ఈ హోదా అడుగుతున్నాయో జాబితా మొత్తం వివరించి.. దాదాపుగా తూచ్‌ అన్నారు. 
అయితే.. ఆయన మాటలకు తమదైన వక్రభాష్యాలు చెప్పడం ద్వారా ప్రజల్ని ఇంకా బురిడీ కొట్టించడానికి చంద్రబాబునాయుడు అనుయాయులైన నేతలు ప్రయత్నిస్తుండడమే ఘోరం. కేంద్రంలోని తెదేపా మంత్రి సుజనా చౌదరి, ఏపీ పాలన వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న సలహాదారు పరకాల ప్రభాకర్‌.. ఇలా మాయమాటలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను నెత్తికెత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఇంద్రజిత్‌ సింగ్‌ మాటలు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని.. సుజనా చౌదరి అంటున్నారు. ప్రత్యేకహోదా ద్వారా దక్కే ప్రయోజనాలన్నీ వస్తాయని అంటున్న సుజనా.. హోదా విషయంలో మాత్రం గ్యారంటీ ఇవ్వడం లేదు. ఇదొక రకం మాయన్నమాట.


పరకాల ప్రభాకర్‌ కూడా తక్కువ తినలేదు. తక్షణం తాను ఎమ్మెల్సీ అయిపోయి.. ఇలా కేబినెట్‌ హోదా ఉన్న సలహాదారు పదవిలో కాకుండా.. దొడ్డిదారిలో కేబినెట్‌లోకే చేరిపోవాలని ఉవ్విళ్లూరుతూ ఉండే ఈ నేత.. కేంద్ర మంత్రి మాటల్లో ‘ప్రత్యేక హోదా ఇవ్వలేం’ అనే మాట లేదు కదా.. అని లాపాయింట్లు తీస్తున్నారు. ఆయన భార్య నిర్మలా సీతారామన్‌ కూడా కేంద్రంలో చక్రం తిప్పుతున్న మంత్రి! హోదా కోసం చంద్రబాబు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను మన రాష్ట్రం నుంచే ఎంపీని చేసి.. పలుమార్లు విన్నవించుకున్నారు కూడా! కనీసం ఆమె నోటితో ఇప్పటిదాకా ‘హోదా ఇస్తాం’ అనలేదు. అందరూ డొంకతిరుగుడు వాక్యాలు చెప్పేవాళ్లే. 


కేంద్రంనుంచి ప్రత్యేక హోదా తీసుకురావడం మాకు చేతకాలేదు.. ఈ విషయంలో కేంద్రం మోసం చేసింది.. క్షమించండి.. అని చంద్రబాబు లెంపలు వేసుకున్నా ప్రజలు మన్నిస్తారేమో గానీ.. ఆయన కోటరీలోని పెద్దలు.. అదే పనిగా.. మాయ మాటలు చెప్పి ప్రతిసారీ బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం.. ఆ సంగతి ప్రజలు గుర్తించారంటే.. చంద్రబాబు కలగనే భవిష్యత్తుకు అది ప్రమాదకరం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: