ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో దోషిగా తేలి ముఖ్యమంత్రి పదవికి ఎనిమిది నెలల క్రితం దూరమైంది జయలలిత.. అదే కేసులో ఇటీవల నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. నిర్దోషిగా బయటపడిన అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత మళ్లీ శ‌నివారం ఉదయం 5వ సారి తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. ఇటీవల బెంగుళూరు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడే జయలలిత గద్దెనెక్కడం ఖాయమనేది తెలిసిపోయింది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ, ఇప్పటికీ ఆమె నిర్దోషిత్వాన్ని అనుమానించేవారున్నారు. అవినీతి ఆరోపణలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కోర్టు తీర్పు తరువాత ఎవరూ అనగలిగేది ఏమీ లేదు.
 

జయలలిత అసాధారణ నాయకురాలు అనడంలో సందేహం లేదు


జ‌రిగిన వివాదాలు ఎట్లా ఉన్నా జయలలిత అసాధారణ నాయకురాలు అనడంలో సందేహం లేదు. ఏటికి ఎదురీదడం ఆమె స్వభావం. ఆ లక్షణమే జయలలిత ను అనేక వ్యతిరేక పరిస్థితులను తట్టుకునే నిలిచేలా చేసింది. ఆమె రాజకీయ మార్గదర్శకుడు ఎమ్ జి రామ‌చంద్ర‌న్(ఎమ్జీఆర్) అనారోగ్యం పాలయినప్పుడు పార్టీలోని ప్రత్యర్థుల కుట్రలను తట్టుకొని నిలిచారు. ఎమ్జీఆర్ మరణం తరువాత పార్టీ సీనియర్లు ఆయన భార్యను ముందు పెట్టి జయలలితను రాజకీయంగా అణగదొక్కాలని ప్రయత్నించారు. అయినా జయలలిత దృఢంగా నిలిచి పోరాడి రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. దేశంలోని జనాకర్షణ గల నాయకులలో ఆమె ఒకరు. మాయావతి, మమతా బెనర్జీ మాదిరిగానే జయలలిత కూడా స్వతహాగా రాజకీయాలలో నిలదొక్కుకున్న మహిళా నాయకురాలు.1991 నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు తమిళనాడు ప్రజలు జయలలితను గద్దెనెక్కించారు.  

మ‌ళ్లీ రాబోవు  ఎన్నికల్లో ఆమె గెలిచినా ఆశ్చర్యం లేదు


మ‌ళ్లీ రాబోవు  ఎన్నికల్లో ఆమె గెలిచినా ఆశ్చర్యం లేదు. ప్రజాభిప్రాయం, కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ, జయలలిత నిర్దోషిగా బయట పడి గ‌ద్దేనేక్కడాన్ని దేశంలోని చాలా మంది ప్రజాస్వామ్య వాదులు జీర్ణించుకోలేక పోతున్నారు. జయలలిత ఖ‌చ్చితంగా దోషి అని ఈ దశలో ఎవరూ చెప్పలేరు. కానీ ఆమె నిర్దోషి అనుకున్నప్పటికీ, కోర్టు తీర్పు కూడా ఇందుకు ఆమోదనీయత ఇవ్వడం లేదెందుకు అనేది ఆలోచించాల్సిన విషయం. మన రాజకీయ వ్యవస్థ అవినీతి వ్యతిరేక పోరాటాన్నినాటకంగా మార్చి, అపహాస్యం చేసి పెట్టిందనేది న‌మ్మాల్సిన నిజం. దేశంలో అవినీతి పోరాటం పేరుతో సాగుతున్న తతంగం వ్యవస్థల మీద నమ్మకం పోయే ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నది.
 

జయలలిత విషయానికే వస్తే కరుణానిధి ముఖ్యమంత్రిగా


ఇందుకు ప్రధాన కారణం  అధికారంలో ఉన్న పెద్దలు అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో కొందరు నాయకులపైనే రాజకీయ వేధింపులకు పాల్పడడం. రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా దర్యాప్తులు సాగుతున్నాయి లేదా నిలిచిపోతున్నాయి. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నాయకులు ఉత్తములనీ, వారిపై దర్యాప్తులు సాగకూడదని కాదు. కానీ అవినీతి నిర్మూలన పేరుతో సాగుతున్న తతంగానికి రాజకీయాలకు లింకు ఉందనే అభిప్రాయం కలగడం వల్ల అవినీతి కేసులకు విలువ లేకుండా పోతున్నది. జయలలిత విషయానికే వస్తే- కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రమణ్యస్వామి ఆరోపణల ఆధారంగా దర్యాప్తుకు ఆదేశించి ఆమెపై కేసు పెట్టించారు. 

జయలలిత నిర్దోషి అయినప్పుడు ఇంతకాలం


ఈ అక్రమాస్తుల కేసు పద్దెనిమిదేండ్లు సాగింది. ఈ మధ్యకాలంలో ప్రజల మద్దతు చూరగొని ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. జయలలిత నిర్దోషి అయినప్పుడు ఇంతకాలం సాగదీసి ఆమెను వేధించడం తప్పే అవుతుంది. అవినీతి ఆరోపణలు ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులు కొన్ని ఆశయాలకు, ఆకాంక్షలకు, సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం సహజం. అటువంటి నాయకులపై దశాబ్దాల కొద్ది దర్యాప్తులు సాగించి వేధించడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ దర్యాప్తుల పేరుతో నిర్దోషులు నష్టపోవడం సమర్థనీయం కాదు. ఇదే విధంగా దోషులు బయటపడడం కూడా ఆమోదయోగ్యం కాదు.

 ప్రజాస్వామిక విలువలను ప్రజలలో ప్రచారం చేయడమే దీనికి


అవినీతిపరులు కోర్టుల ద్వారా నిర్దోషులుగా బయటపడవచ్చు. దీనికి తోడు అవినీతి పరులైన నాయకులను ప్రజలే ఎన్నుకున్నప్పుడు చేయగలిగేది ఏముంటుందనే నైరాశ్యం ప్రజాస్వామ్య ప్రియులలో కలగడం సహజం. చైతన్యవంతులు విలువలతో కూడిన రాజకీయాలను, ప్రజాస్వామిక విలువలను ప్రజలలో ప్రచారం చేయడమే దీనికి పరిష్కారం. ప్రజాస్వామ్యం అనేది సామాజిక సంస్కృతిగా మారినప్పుడు, రాజకీయాల ప్రక్షాళన కూడా సాధ్యమవుతుంది. ఎన్ని లోపాలున్నా ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యాన్ని పాదుకునేలా చేయడమే ఈ రుగ్మతలకు చికిత్స.


అవినీతిపరులు కోర్టుల ద్వారా నిర్దోషులుగా బయటపడవచ్చు. దీనికి తోడు అవినీతి పరులైన నాయకులను ప్రజలే ఎన్నుకున్నప్పుడు చేయగలిగేది ఏముంటుందనే నైరాశ్యం ప్రజాస్వామ్య ప్రియులలో కలగడం సహజం. చైతన్యవంతులు విలువలతో కూడిన రాజకీయాలను, ప్రజాస్వామిక విలువలను ప్రజలలో ప్రచారం చేయడమే దీనికి పరిష్కారం. ప్రజాస్వామ్యం అనేది సామాజిక సంస్కృతిగా మారినప్పుడు, రాజకీయాల ప్రక్షాళన కూడా సాధ్యమవుతుంది. ఎన్ని లోపాలున్నా ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: