కేంద్రం మరోసారి ఏపీని ఉస్సూరనిపించింది. ఏపీ కోసం ప్రత్యేక రైల్వేజోన్ పకటనను మరోసారి వాయిదా వేసింది. రైల్వే మంత్రి సురేష్  ప్రభు విశాఖ పర్యటన సందర్భంగా వస్తుందనుకున్న రైల్వే జోన్ ప్రకటన ఉట్టిట్టి హామీలతోనే సరిపోయింది. జోన్ ఏర్పాటును తీవ్రంగా పరిశీలిస్తున్నామంటూనే ప్రకటనను మాత్రం దాట వేశారు రైల్వే మంత్రి. 

విశాఖ జోన్.. వట్టి మాటలేనా..?


రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. మోడీ ఏడాది పాలన కార్యక్రమం సందర్భంగా విశాఖ వచ్చారు. మోడీ పాలన గురించి దాదాపు అరగంటకుపైగా ఊదరకొట్టారు. ఐతే.. విశాఖ రైల్వేజోన్ పై మంత్రి ప్రకటన చేయవచ్చని.. అంతకుముందే మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో.. మంత్రిగారి నోట జోన్ ప్రకటన వస్తుందేమోనని జనం సహనంగా ఎదురు చూశారు. 

మోడీ పరిపాలన ప్రశంసల వర్షం అయిపోయాక.. చివరలో సురేశ్ ప్రభు రైల్వే జోన్ విషయానికి వచ్చారు. ఇక్కడి ప్రజల మనోభావాలు తమకు తెలుసని.. వాటిని గౌరవిస్తామని ఊరడింపు మాటలు చెప్పారు. జోన్ ఏర్పాటును తీవ్రంగా పరిశీలిస్తున్నామని త్వరలోనే అది నెరవేరుతుందని రొటీన్ డైలాగలు చెప్పారు.

విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ కావాలన్న డిమాండ్ ఈనాటిది కాదు.. దాదాపు 13 ఏళ్లుగా ఈ అంశంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాతైనా జోన్ ఏర్పాటు జరుగుతుందని ఆశించిన వారికి ఎప్పటికప్పుడు ఆశాభంగమే అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: