రాజకీయ నేతల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. కొందరు మాస్.. మరికొందరు క్లాస్.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయానికి వస్తే చంద్రబాబు కాస్త క్లాస్ గా కనిపిస్తే.. కేసీఆర్ మాస్ లీడర్ గా కనిపిస్తారు. ప్రసంగాలు, విమర్శలు, పంచ్ ల విషయానికి వస్తే ఈ ఇద్దరిలో చంద్రబాబు కంటే కేసీఆర్ దే పై చేయి అని చెప్పక తప్పదు. ఒక్క డైలాగులు, పంచ్ విషయంలోనే కాదు..జనంలో కలసిపోవడంలోనూ కేసీఆర్ చంద్రబాబు కంటే ముందువరుసలోనే ఉంటాయి.

ప్రజలను పరామర్శించేటప్పుడు, వారితో మమేకమయ్యేటప్పుడు కేసీఆర్ ప్రవర్తన చంద్రబాబు కంటే మెరుగ్గానే ఉంటుంది. పాపం.. చంద్రబాబుకు ప్రజలపై ఎంత ప్రేమ ఉన్నా.. మనస్ఫూర్తిగా మాట్లాడినా.. ఆయన ముఖంలో ఆ భావన చూసేవారికి కనిపించదు. ఇక పెద్దలను గౌరవించే విషయంలోనూ ఇద్దరు నేతలవీ విబిన్నమైన పద్ధతులే. ఎవరైనా ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలను కలుకున్నప్పుడు చంద్రబాబు షేక్ హ్యాండ్ తో సరిపెడతారు. అంతగా ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తే తిరుపతి ప్రసాదమో.. ఓ జ్ఞాపికో, శాలువానో కప్పుతారు. ఓ గిఫ్ట్ ఇచ్చి మమకారం చాటుకుంటారు. 

సాష్టాంగ నమస్కారం.. కేసీఆర్ స్టైల్.. 


కేసీఆర్ స్టైల్ దీనికి పూర్తి భిన్నం. ఆయన ఆప్యాయంగా హత్తుకుంటారు. పెద్దలు, దిగ్గజాలు అనుకుంటే వారి పాదాలకు సైతం నమస్కారం చేస్తారు. మొన్నటికి మొన్న యాదగిరిగుట్ట పర్యటనలో కేసీఆర్ చిన్నజీయర్ స్వామి పాదాలకు సాష్టాంగపడి నమస్కారం చేశారు. చిన్నజీయర్ కే కాకుండా పక్కనే ఆధ్యాత్మిక సేవలో ఉన్న నరసింహన్ కు కూడా సాష్టాంగనమస్కారం చేశారు. 

అంతేకాదు.. తన గురువులను సన్మానించే సమయంలోనూ కేసీఆర్ పూర్తిగా వారికి సాష్టాంగపడతారు. వారి పాదాలను తన్మయత్వంతో తాకుతారు. లేటెస్టుగా హైదరాబాద్ కు వచ్చిన ప్రణబ్ ముఖర్జీకి కూడా కేసీఆర్ పాదాభివందనం చేశారు. చంద్రబాబు నుంచి ఈ తరహా స్పందన మనం ఎంత మాత్రం ఆశించలేం.  ఐతే.. ఈ విషయంలో ఒకరు గొప్ప మరొకరు తక్కువ అన్న అభిప్రాయం సరికాదు.. ఎవరి స్టైల్ వారిదే అని సరిపెట్టుకోవాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: