మన్మధుడు సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. తాత పాత్రలోని బాలయ్య, నాగార్జునతో ఒక అంటాడు. ‘వాళ్లంతేరా జీతాలిస్తే పనిచేస్తారు.. బోనస్‌లిస్తే ప్రేమిస్తారు.. అవి లేకపోతే ఇక అంతే’’ అన్నట్లుగా చెబుతారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా అంతేనా అని అనిపిస్తోంది. పదవులు ఇస్తేనే పార్టీలో ఉంటాం. పదవుల పందేరం చేయనప్పుడు ఇక పార్టీతో పనేం ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గతంలో పీసీసీ చీఫ్‌గాను, మంత్రిగాను వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్‌ ఇప్పుడు తెరాసలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
డీఎస్‌ గనుక తెరాసలో చేరితో సీనియర్ల రూపంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో దెబ్బ తగిలినట్లే భావించాలి. తాను స్వయంగా నియోజకవర్గంలో గెలవలేకపోయిన నేతే అయినప్పటికీ.. ఆయన పార్టీలో మాత్రం సీనియరుగా ఒక వర్గానికి పెద్దదిక్కుగా చెలామణీ అవుతూ వచ్చారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోతున్నా పార్టీ అధిష్ఠానం ఆయనకు ప్రతిసారీ ఏదో ఒక పదవి కట్టబెడుతూనే వచ్చింది. ఎమ్మెల్సీ గా మొన్నటిదాకా పదవిలోనే ఉన్నారు. అయితే ఆ పదవీకాలం పూర్తయిన తర్వాత.. మళ్లీ తన పదవిని పొడిగించలేదని డీఎస్‌కు కోపం వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
ఎమ్మెల్సీ పదవిని తనకు మరోసారి కట్టబెట్టకుండా.. విస్మరించడంపై డీఎస్‌ కినుక వహించారుట. దాంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెరాసలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారుట. ఆ మేరకు అనుచరులతో సంప్రదించినప్పుడు కూడా.. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వని కాంగ్రెసు పార్టీలో ఉండడం కంటె.. తెరాసలో చేరిపోవడమే ఉత్తమం అని ఆయన అనుచరులంతా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
మొత్తానికి పదవి ఇవ్వలేదని ఒకరు, పదవినించి తొలగించారని ఒకరు, పదవిలో ఉన్నప్పటికీ.. కూడా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే మరో మార్గం లేదని కొందరు ఇలా నాయకులంతా గులాబీ బాట పట్టిపోయేలా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెరాస ఆకర్ష మంత్రానికి లోబడడానికి సిద్ధంగా మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: