ఓటుకు నోటు కేసులో వీడియో సాక్ష్యాల సహా దొరికిపోయిన రేవంత్‌రెడ్డికి బెయిలు లభించింది. ఈ కేసులు నిరూపణ అయినా సరే.. పడేది కేవలం ఆరు నెలలనుంచి అయిదేళ్ల శిక్ష మాత్రమే గనుక.. ఇప్పటికే నిందితులు ఒక నెలనుంచి జైల్లోనే ఉన్నారు గనుక.. ఇవి బెయిలు ఇవ్వదగిన కేసులే గనుక.. ఇస్తున్నట్లుగా న్యాయమూర్తి సెలవిచ్చారు. అయితే దీనిమీద సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నామని, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేస్తామని, రేవంత్‌ బెయిల్‌ ఆర్డర్‌ను కొట్టివేయిస్తామని.. ఏసీబీ తరఫు వాదించిన న్యాయవాదులు ప్రకటించారు. వాస్తవానికి వారు సుప్రీంను ఆశ్రయించడం రేవంత్‌ బెయిల్‌ వ్యవహారాన్ని కూడా మరింత రచ్చకీడ్చుతామనే ప్రకటనలు అన్నీ ఉత్తుత్తివే అని తెలుస్తోంది. 
ఓటుకు నోటు, రేవంత్‌ రెడ్డి వ్యవహారం చాలా వరకు చప్పబడిపోయినట్లుగా కొన్నాళ్లుగా అందరూ అనుకుంటున్నారు. దీన్ని గురించి నాయకులు పరస్పర దూషణలతో నిందించుకోవడం తగ్గిపోయింది. ప్రభుత్వాల మధ్య మంటలు చిమ్మే మాటలు తగ్గాయి. ఏతావతా.. కేసు నెమ్మదిగా చల్లారిపోతున్నదనే సంకేతాలు ప్రజలకు అందాయి. ఇలాంటి సంకేతాలకు బలం ఇచ్చే మాదిరిగానే స్టీఫెన్సన్‌ నాటి బిఫోర్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. రేవంత్‌కు బెయిల్‌ తప్పక వస్తుందనే అంతా అనుకున్నారు. మొత్తానికి నెల రోజుల తర్వాత ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. 
‘నిందితులకు బెయిలు ఇవ్వచ్చా’ అని కోర్టు అడిగినప్పుడు విచారణ సంస్థ తరఫు న్యాయవాదులు ‘ఓకే’ అనడం చరిత్రలో ఎక్కడా ఉండదు. ‘ఇవ్వరాదు’ అంటూ.. ఎందుకు ఇవ్వరాదో వివరిస్తూ వాళ్లు బోలెడు వాదనలు వినిపిస్తారు. అదే పని కూడా ఇక్కడ కూడా చేశారు. నిందితులు బయటకు వస్తే.. సాక్ష్యాలు తారుమారు అవుతాయన్నారు. అయితే ఆ అభ్యంతరాల్ని కొట్టి పారేస్తూ కోర్టు బెయిలిచ్చేసింది. దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తాం అని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రకటించారు గానీ.. ఈ  విషయాన్ని వారంత సీరియస్‌గా తీసుకోకపోవచ్చునని విశ్వసనీయంగా తెలుస్తోంది. 
రేవంత్‌ రెడ్డి ఎపిసోడ్‌ను వీలైనంతగా రచ్చకీడ్చడం జరిగిపోయందని, దీని ద్వారా వారి అక్రమ ప్రవర్తనను ప్రజల దృష్టికి తీసుకెళ్లిపోయామని, ఇక సుప్రీంను ఆశ్రయించడం వంటి పనుల ద్వారా దీన్నే పట్టుకు వేళ్లాడ్డం అనవసరం అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. పైగా బెయిల్‌ను సవాలు చేస్తూ సుప్రీం కు వెళ్లడంలో ఏసీబీ ముందడుగు వేయకపోవచ్చు. వారు మరీ అంత సీరియస్‌గా ఈ కేసు విషయంలో కదలడం లేదని పలువురి ఊహగా ఉంది. 
తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను విచారించడానికి నోటీసులు ఇచ్చి, ఆయన విచారణకు రాకుండా అనారోగ్యం పేరిట పదిరోజుల గడువు అడిగినా.. ఏసీబీ ఆయన గురించి పట్టించుకోలేదు. గడువు దాటిపోయినా కూడా వారివైపు నుంచి యాక్షన్‌ లేదు. నిజానికి మళ్లీ నోటీసులు ఇవ్వడం లేదా, కోర్టు ద్వారా అరెస్టుకు వారెంటు పొందడం జరగాలి. అలాంటి స్టెప్‌ కూడా ఏసీబీ పరంగా పడలేదు. సండ్ర విషయంలో పూర్తి తమకు ఎడ్వాంటేజీ ఉన్న దానిలోనే పట్టించుకోకుండా వదిలేసిన ఏసీబీ.. రేవంత్‌ విషయంలో హైకోర్టు విచక్షణను సవాలు చేసేలా.. సుప్రీం కోర్టును ఆశ్రయించేంత పనిచేయకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. పైగా ఆ వాదనలో బలం లేదని, మళ్లీ సుప్రీం ఎదుట మరోసారి ఓడిపోవడం తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి.. ఏసీబీ మిన్నకుంటుందని న్యాయనిపుణులు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: