హైదరాబాదు నగరమూ మరియు సెక్షన్‌  8 అనే రగడ రకరకాలుగా రూపాంతరం చెందుతూ వస్తోంది. రేవంత్‌ రెడ్డికి బెయిల్‌ కూడా వచ్చేసిన తర్వాత.. ఈ గొడవ చాలా వరకు సద్దుమణిగిందని అనుకోవాలి. ఎటూ తమ నాయకుడు జైలునుంచి వచ్చాడు గనుక..  తెలుగుదేశం వారు పదేపదే దీన గురించి మాట్లాడ్డం కూడా తగ్గించారు. అయితే లోలోపల హైదరాబాదు నగర అస్తిత్వానికి సంబంధించి కీలకమైన విషయం ఏమైనా జరుగుతోందా? అనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి. ప్రత్యేకించి దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మాటలు కొందరిలో భయాల్ని రేకెత్తిస్తున్నాయి. 
‘‘హైదరాబాదు నగరం ఒక్క తెలంగాణదే అనుకోవడానికి వీల్లేదు. తెలుగు వారిది మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. ఇది దేశానికే విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది.. ఇది దేశానికంతటికీ చెందిన నగరం’’ ఈ మాటలు స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవచించినవి. అదేదో ప్రభుత్వాలు తయారుచేసి ఇచ్చిన  ప్రసంగపాఠాల్లోంచి కోట్‌ చేస్తున్న వాక్యాలు కాదు. ఆయన ఆశువుగా.. గవర్నరు విద్యాసాగరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్న వేదిక మీదినుంచి చెప్పిన మాటలు..! ఈ మాటలు పైకి హైదరాబాదు నగర ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ మాటల వెనుక నిగూఢమైన అర్థం ఏమైనా ఉన్నదా.. అనేది కొందరిలో సందేహం. రాష్ట్రపతి మాటలను, హైదరాబాదును యూటీగా మార్చాలనే కేంద్రం యొక్క ఆలోచనకు ప్రతిబింబాలుగా పరిగణించాలా అని కొందరు మల్లగుల్లాలు పడుతున్నారు. 
హైదరాబాదును యూటీగా చేయాలనే డిమాండు విభజన సమయంలో కొంత ఘనంగా వినిపించింది. పూర్వపుకాలంలో.. అంబేద్కర్‌ సూచించినట్లుగా హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా మార్చి.. యూటీ చేయాలని కొందరు వాదించారు. తీనా విభజన సమయానికి ఈ వాదనలన్నీ వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు సెక్షన్‌ 8 గురించి రగడ జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆ వాదన తెరపైకి తెచ్చారు. యూటీ అంటూ ఎవరైనా మాట్లాడితే.. హైదరాబాదు నగరం నిరసనలతో అగ్నిగుండం అవుతుందని తెలంగాణ వాదులు హెచ్చరించారు. వారు ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రానికి ఈ నగరమే గుండెకాయ వంటిది గనుక.. వారి ప్రకటనలు కూడా కరక్టే. 
అయితే... రాష్ట్రపతి మాటల వెనుక నిగూఢార్థం ఉన్నదా అని కొందరు అనుమానిస్తున్నారు. ఉత్తినే అలాంటి మాటలు ఆయన నోటివెంట యథాలాపంగా వచ్చి ఉంటాయా అని చర్చించుకుంటున్నారు. ఆచరణలో దీనికి చాలా చిక్కులు ఉన్నాయి గానీ.. ఏపుట్టలో ఏ పాముంటుందో అన్న సామెత చందంగా.. ఏ మాటలో ఏ మర్మమైన మీనింగు ఉన్నదో అని అంతా అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: