చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న జిల్లాల్లో కులచిచ్చు రేపుతున్నారా.. దళిత కులాలకు చెందిన నాయకులను రెచ్చగొట్టి ప్రతిపక్షపార్టీ నేతలపైకి ఉసిగొలుపుతున్నారా.. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో కులాల మధ్య గొడవలను ప్రోత్సహిస్తున్నారా.. అవుననే అంటున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు. 

మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి అరెస్టు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని వారు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న గొడవను ఆసరాగా చేసుకుని చంద్రబాబు చక్రం తిప్పి భూమాను అరెస్టు చేయించారని చిత్తూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె పట్ల అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా.. తిరిగి వారిపైనే కేసుపెట్టి అరెస్టు చేయడం దారుణమని నారాయణస్వామి అంటున్నారు. 

ఇది కుల రాజకీయమే.. : వైఎస్సార్ సీపీ


ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకున్నందుకే భూమాపై కక్షకట్టి అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ దేవదానంకు మొదట భూమాపై కేసు పెట్టే ఆలోచన లేదని.. హైదరాబాద్ నుంచి టీడీపీ నేతల నుంచి వచ్చిన వత్తిళ్ల మేరకే ఆయన కేసు పెట్టారని వారు అంటున్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీకి పెద్ద దిక్కుగా ఉన్న భూమాను అరెస్టు చేస్తే.. క్యాడర్ వీక్ అవుతుందని చంద్రబాబు కుట్ర పన్నారని నారాయణ స్వామి మండిపడ్డారు.

కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భూమా కుటుంబాన్ని వేధించడం అధికారపార్టీకి ఓ అలవాటుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తూ.. ఆయన చెప్పినట్టల్లా ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అరెస్టు వ్యవహారం ఇలా కులాల మధ్య చిచ్చుగా పేరు తెచ్చుకోవడం అంత మంచిపరిణామమేమీ కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: