కొన్నిరోజులుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మళ్లీ కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరో కీలక వ్యక్తిగా భావిస్తున్న జిమ్మీని కూడా తెలంగాణ ఏసీబీ అరెస్టు  చేయవచ్చని తెలుస్తోంది. 

వీరిద్దరూ తమ ఎదుట హాజరుకావాలంటూ లేటెస్టుగా ఇచ్చిన నోటీసులను పరిశీలిస్తే వీరి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలిసిపోతుంది. గతంలోనూ సండ్రను నోటీసు ఇచ్చినా.. అది సెక్షన్ 160 కింద ఇచ్చారు. దానికి తాను అనారోగ్యంతో ఉన్నానని సండ్ర బదులిచ్చారు. కానీ ఈసారి సండ్రకు 160 సెక్షన్ బదులు 41 ఎ కింద నోటీసులు ఇచ్చారు. 

ఓటుకు నోటు ఊపందుకుంటుందా.. ?


41ఎ అంటే.. విచారణకు పిలిపించుకున్న వ్యక్తిని అక్కడే అరెస్టు చేసే వెసులుబాటు ఏసీబీకి ఉంటుంది. అరెస్టు చేసే ఉద్దేశంతోనే వీరిద్దరికీ 41ఎ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ కేసు విచారణ మొదలై దాదాపు 40 రోజులు కావస్తున్నా.. పెద్దగా పురోగతి కనిపించలేదు. చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు మందకొడిగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. 

ఈ ఓటుకు నోటు కేసు విషయంలో సండ్ర పాత్రపై తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు. సండ్ర ఈ నోటుకు వోటు వ్యవహారంలోని కీలక వ్యక్తులతో అనేకసార్లు ఫోన్లో మాట్లాడారట. ఈ ఆధారాలతోనే అరెస్టుకు పూనుకుంటున్నా.. ఇంకా అంతర్గతంగా మరికొన్ని బలమైన ఆధారాలున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి అరెస్టులు జరిగితే కేసు మరికొన్నికీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: