ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో ఓ సుదీర్ఘమైన వ్యాసం రాస్తారు. సమకాలీన రాజకీయ అంశాలతో పాటు పలు కోణాలను అందులో ఆవిష్కరిస్తారు. ఐతే.. ఇటీవల ఈ శీర్షికతో ఆయన రాసిన ఓ వ్యాసం వివాదాస్పదమైంది. పుష్కరాల్లో తొలిరోజు ప్రమాదంపై ఆయన విశ్లేషణే అందుకు కారణమైంది. 

రాజమండ్రి పుష్కరాల్లో తొలిరోజు తొక్కిసలాట ఘటనకు కొందరు ప్రవచనకారులు, పీఠాధిపతులు చెప్పిన ఉపదేశాలే కారణమనే కోణంలో రాధాకృష్ణ రాశారు. ఐతే.. ప్రచార ఆర్భాటం కోసం, లఘుచిత్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్ వద్ద కాకుండా పుష్కర ఘాట్ దగ్గర స్నానం చేయడం.. అందులోనూ గంటన్నరకు పైగా పూజలు చేయడం తొక్కిసలాటకు కారణమైందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

నెలకు అరకోటి లాభం పొందుతున్నారా..?

Image result for abn andhra jyothi logo
రాధాకృష్ణ మాత్రం ఆ కోణం స్పృశించకుండా కేవలం పీఠాధిపతులు, ప్రవచనకారుల బోధనల కారణంగానే జనం పోటెత్తారని రాయడాన్ని మరో పత్రిక ఎడిటర్ తీవ్రంగా ఖండించారు. దాంతోపాటు రాధాకృష్ణ - చంద్రబాబు సంబంధాలపై ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల వీడియో ఫుటేజీని అన్ని ఛానెళ్లకూ అందించే కాంట్రాక్టు ఏబీఎన్ రాధాకృష్ణ దక్కించుకున్న విషయాన్ని సదరు ఎడిటర్ ప్రస్తావించారు. 

ఈ కాంట్రాక్టు కారణంగా ఏబీఎన్ రాధాకృష్ణ.. అన్ని ఖర్చులు పోను నెలకు 50లక్షల రూపాయలు పోగేసుకుంటున్నారని కామెంట్ చేశారు. సర్కారు నుంచి అంత మొత్తంలో లాభం పొందుతున్నందువల్లే.. రాధాకృష్ణ ముఖ్యమంత్రిని వెనకేసుకొస్తూ.. అభం శుభం తెలియని స్వామీజీలపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఘాటుగానే రాశారు. ఎవరితోనైనా కయ్యం పెట్టుకోవడానికి ఏమాత్రం వెనుకాడని నైజం రాధాకృష్ణది. మరి ఈ ఎడిటర్ రాతలపై ఆయన ఎలా స్పందిస్తారో.. చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: