వెంకయ్యనాయుడు వాక్చాతుర్యంలో మహాదిట్ట. తిమ్మిని బమ్మినిచేసి ప్రతిపక్షాల విమర్శలను గందరగోళంలోకి నెట్టేసి.. క్లిష్ట పరిస్థితులనుంచి ప్రభుత్వాన్ని గట్టుకు నెట్టుకురాగల దిట్ట. అందుకోసం ఆయన ఎలాంటి విషయాన్ని అయినా తనకు అనుకూలంగా వాడుకోగలరు. చివరికి ఉగ్రవాదుల దాడిని అయినా సరే...! ఒకసారి తాను 'వాడడం' మొదలెడితే.. ఇక ఇతరులు వాడుకోవడానికి ఏమీ మిగలదని ఆయన నిరూపించారు. 


సోమవారం నాడు ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభలో కార్యకలాపాలను స్తంభింపజేయడంపై వెంకయ్యనాయుడు మహా కోపం తెచ్చేసుకున్నారు. ఒకవైపు దేశంలో ఉగ్రవాద దాడి జరుగుతోంటే.. మీరు ఇక్కడ సభలో రాజకీయాలు చేస్తున్నారేమిటి? అంటూ ఆయన ప్రతిపక్షాన్ని విమర్శించారు. అంటే ఆయన ఉద్దేశం దేశంలో ఉగ్రవాదుల దాడి జరుగుతున్నది గనుక.. సభలో ఏ చర్చ జరుగుతున్నా విపక్షాలు నోరు మెదపకుండా కూర్చోవాలి అన్నట్లుగా కనిపిస్తోంది. దాడి గురించి చర్చిద్దాం అంటే.. వెంకయ్యనాయుడు దానికి సంబంధించిన సమాచారం మా వద్ద లేదు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత.. హోంమంత్రి ప్రకటన చేస్తారు- అని సెలవిచ్చారు. ఇతర సమస్యలపై ఆందోళన చేస్తే.. ఒకవైపను దాడి జరుగుతోంటే.. ఇక్కడ రాజకీయం చేస్తారా అంటూ నిలదీస్తారు.. ! ఇలా మడతపేచీల్తో ప్రతిపక్షాల్ని ఆడుకోవడం బహుశా వెంకయ్యనాయుడుకు మాత్రమే వెన్నతో పెట్టిన విద్య కావొచ్చు. 


ఆయన ధ్యాస మొత్తం కాంగ్రెసును నిందించడం మీదనే తప్ప.. సభావ్యవహారాల మీద కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. కొందరు పాదయాత్రలు చేస్తారు, కొందరు పార్లమెంటు బయట విమర్శిస్తారు. కానీ సభలో మాత్రం చర్చను జరగనివ్వరు అంటూ.. వెంకయ్యనాయుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఎత్తిపొడుపు మాటలు సంధించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీ తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది. అవినీతి ఆరోపణలు వచ్చిన కేంద్రమంత్రి, సీఎంలను పదవుల్లోంచి తొలగిస్తే తప్ప సభను సాగనివ్వం అంటూ ఒకవైపు ప్రతిపక్షం పట్టుపడుతుండగా, ఆ విషయంలో ససేమిరా అంటూ ప్రభుత్వం పార్లమెంటు వ్యవహారాలు మొత్తం రచ్చరచ్చ అయిపోడానికే మొగ్గుచూపుతున్నది. ప్రతిపక్షాల్ని విమర్శించడానికి పంజాబు ఉగ్రవాద దాడిని కూడా ప్రభుత్వం వాడేసుకోవడం పరాకాష్ట. 


మరింత సమాచారం తెలుసుకోండి: