వైఎస్‌ జగన్మోహనరెడ్డి కేవలం వైకాపా ఆంధ్రప్రదేశ్‌ శాఖకు అధ్యక్షుడు కాదు. ఆయన పార్టీ అధినేత. అలాంటప్పుడు ఆయన ఆధ్వర్యంలో సొంతంగ నిర్వహిస్తున్న ఉద్యమానికి, ప్రజల కోసం చేస్తున్న పోరాటానికి ఆయన పార్టీ మొత్తం కట్టుబడి ఉండాలి. అందరూ ఆయన వెంట నిలవాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. ఏకంగా దేశరాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున కేంద్రంపై పోరాటానికి జగన్‌ శంఖం పూరిస్తుండగా.. తెలంగాణలోని ఆయన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇది తమ వ్యవహారం కాదన్నట్లుగా దూరం దూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించడం అనే అంశంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైనంత మాత్రాన తన సొంత పార్టీలోనే జగన్‌ ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. 


నిజానికి ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం తప్ప అన్ని పార్టీలూ అంతో ఇంతో తమ గళం వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేకహోదాను , ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వడం లేదు అంటూ కాంగ్రెస్‌ గట్టిగానే యాగీచేస్తోంది. ఆ పార్టీకి రాష్ట్రంలో బలం లేకుండా పోయిందిగానీ.. ఈ అంశంపై తాము చేయగలిగింది చేశారు. మొన్నటికి మొన్న అనంతపురానికి వచ్చిన రాహుల్‌గాంధీ.. ప్రత్యేకహోదా గురించి తెలుగుదేశం, వైకాపా మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టారు. అధికార, ప్రతిపక్షాలు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అని ఆయన ఎద్దేవాచేశారు. దీంతో జగన్‌కు కోపం వచ్చేసినట్లుంది. ఆయన తన అనంతజిల్లా పర్యటన ముగిసేరోజున ప్రత్యేకహోదా కోసం పోరాటం ఎజెండాను కూడా ప్రకటించారు. తమ పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తాం. ప్రభుత్వాల కళ్లు తెరచుకునే వరకు ధర్నాచేస్తాం అని ఆన వెల్లడించారు. 


అయితే 67 మంది ఎమ్మెల్యేలు అంటే అది వైకాపాకు కేవలం ఏపీలో ఉన్న బలం మాత్రమే. దాని అర్థం.. తెలంగాణలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఈ పోరాటానికి దూరంగా ఉంటారన్నమాట. ఏపీకి ప్రత్యేకహోదా అంటే అదేమీ తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న పని కాదు కదా! విభజన చట్టంలో ఉన్నదే ఇమ్మంటున్నారు తప్ప.. కొత్తగా తెలంగాణ నుంచి దోచి, ఏపీకి ఇవ్వాలని అడగడం లేదు కదా! అలాంటప్పుడు తెలంగాణలోని ఆ పార్టీ ప్రతినిధులు కూడా మద్దతు ఇచ్చి పాల్గొంటే వారి డిమాండుకు బలం పెరుగుతుంది తప్ప.. అది తెలంగాణ వ్యతిరేకత కింద ముద్ర పడే అవకాశం లేదు. కానీ.. వారు మాత్రం పాల్గొనేలా కనిపించడం లేదు. తన పార్టీకే చెందిన తెలంగాణ నాయకుల్లోనే జగన్‌ ఒక సానుకూల అభిప్రాయాన్ని తీసుకురాలేనప్పుడు.. ఇక కేంద్రం మెడలు వంచి తన డిమాండ్‌ను ఎలా సాధించుకోగలడు? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరి జగన్‌ తన నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటారో.. తన పోరాటంతో ఏం ఫలితం సాధిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: