దేశమంతా ప్రతి వ్యక్తీ గర్వించదగిన మహనీయుడు అబ్దుల్‌ కలాం మనకిక లేరు. కానీ, ఆయన వదలి వెళ్లిన స్ఫూర్తి కొన్ని తరాల పాటూ మనతో పాటూ ఉంటుంది. మనకు మార్గనిర్దేశనం చేస్తుంది. అయితే అబ్దుల్‌ కలాం జీవితం నేర్పించే స్ఫూర్తిని, సందేశాన్ని మనం భావితరాలకు కూడా పదిలంగా అందించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కలాం మరణించిన తర్వాత మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీసుకున్న నిర్ణయం గొప్పగా ఉంది. కలాం జీవితాన్ని తమ రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల్లో చేరుస్తాం అని ఆయన ప్రకటించారు. ఇది ఒక రాష్ట్రంలో కాదు.. దేశమంతా జరగాల్సిన మంచి పని. దేశమంతా ప్రతివిద్యార్థికీ ఈ స్ఫూర్తి తెలిసేలా కలాం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లోకి తీసుకురావాలి. 


రైల్వే ప్లాట్‌ఫారం టీ అమ్మే ఒక కుర్రవాడు.. దేశానికి ప్రధాని కావడం అనేది ఈ దేశంలో సాధ్యం అవుతుంది. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అయిన భారత్‌ ఔన్నత్యం అది.. అని అందరూ మోడీ ప్రధాని అయినప్పుడు మురిసిపోయారు. కానీ అంతకంటె చాలా కాలం ముందే.. చిన్నతనంలో రైల్వేస్టేషను నుంచి దినపత్రికల కట్ట తీసుకువచ్చి ఇంటింటికీ తిరిగి అమ్మే ఒక పేపర్‌ బాయ్‌.. ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. అంతటి ఘనమైన అద్భుతమైన దేశం మనది. ఆ పేపర్‌ బాయ్‌ కేవలం స్వయంకృషితో.. ప్రపంచం నివ్వెరపోయే... భారతజాతి గర్వించేంతటి ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త అయ్యాడు. అలాంటి జీవితపు నిమ్నోన్నతాల గురించి భవిష్యత్‌ తరాలకు తెలియకపోతే ఎలాగ? 


అబ్దుల్‌ కలాం అనే మహనీయుడు తన జీవిత సర్వస్వమూ.. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేయడం అనే కసరత్తులోనే గడుపుతూ వచ్చారు. తను నమ్మిన విలువలను, జీవితంలో ఉన్నత స్థానాలను అందుకోవడానికి పరిశ్రమించేలా తను నమ్మిన మార్గాన్ని భావిపౌరులు అయిన విద్యార్థులకు అందించడమే తన లక్ష్యంగా ఆయన పనిచేశారు అలాంటి వ్యక్తి జీవితాన్ని పాఠ్యాంశంగా మారిస్తే.. కొన్ని తరాలపాటూ.. అది స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రికి వచ్చిన ఆలోచన దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: