వరంగల్‌ ఎంపీస్థానానికి ఉప ఎన్నిక సంగతి ఖరారైంది. కచ్చితంగా ఎప్పుడు ఎన్నిక జరుగుతుందనే షెద్యూలు ఇంకా విడుదల కాకపోయినప్పటికీ.. త్వరలోనే ఎన్నికల ఉంటాయన్నది అందరూ ఊహిస్తున్న సంగతి. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ కూడా.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎవరిని మోహరించాలి.. తమ తమ విజయావకాశాలను ఎలా తయారుచేసుకోవాలి అనే కసరత్తులో ఉన్నాయి. ప్రస్తుతం తెరాస ఖాతాలో ఉన్న ఈ సీటులో మరొకరు గెలవడం అంత ఈజీ కాకపోయినా.. ఎవరి కలల్లో వారున్నారు. అయితే తమాషా ఏంటంటే.. వామపక్ష పార్టీలు కూడా.. ఈ ఎన్నికల్లో దిగడానికి ఉత్సాహపడుతున్నాయి. 


తెరాస పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని, అసంతృప్తితో ఉన్నారని.. ఇలాంటి సమయంలో వరంగల్‌ ఎన్నికలో తాము తప్పకుండా పోటీచేస్తాం అంటూ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెబుతున్నారు. అయితే వామపకక్షూటమి తరఫున ఒకే అభ్యర్థిని నిలబెట్టేలా.. వీరు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. లెఫ్ట్‌ కూటమినుంచి బలమైన అభ్యర్థినే ప్రకటిస్తాం అని.. ఆయన అంటున్నారు. 


నిజానికి తెరాసకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటున్న ఈ సీటులో పోటీ గురించి కాంగ్రెస్‌ తెదేపా పార్టీలే ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. టికెట్‌ అడిగేవారున్నారా.. నేతల్ని బతిమాలి పోటీచేయించాలా అనే పరిస్థితిలో ఆ పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వామపక్షాలు తొడగొట్టి మేం రంగంలో ఉండబోతున్నాం.. అధికార తెరాసకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం అంటుండడం శుభపరిణామమే. ఒకప్పట్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని రైతుసాయుధ పోరాటమే ప్రజలకు వెట్టిచాకిరీనుంచి విముక్తి ఇచ్చిందని, సుదీర్ఘ ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉండడానికి కూడా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతాయని తమ్మినేని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: