తలసాని శ్రీనివాసయాదవ్‌ రాజీనామా వ్యవహారంలో స్పీకరు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. గవర్నరు రాష్ట్రపతి హైకోర్టు ... ఇలా అందరు పెద్దలను ఆశ్రయించేసిన తర్వాత.. తలసాని రాజీనామా విషయంలో రాద్ధాంతం చేస్తున్న ఉభయ పార్టీ నాయకులూ తిరిగి స్పీకరునే తప్పుపడుతూ.. విరుచుకుపడడం ప్రారంభించారు. తెదేపా నాయకులు స్పీకరును ఇంట్లో కలసి, ఇంటి వద్ద రోడ్డుపై ధర్నాలు కూడా చేశారు. కాంగ్రెస్‌ వారు కూడా నిందల్ని పూర్తిగా స్పీకరు మీదికే సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే ఆమోదించేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. సనత్‌నగర్‌కు ఉప ఎన్నిక జరిగితే.. ఆ ఎన్నిక ఇప్పటిదాకా తెలంగాణ లో కేసీఆర్‌ ప్రభుత్వం సాగించిన పాలనకు లిట్మస్‌ టెస్టు లాగా అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. 


తన రాజీనామా గురించి రాద్ధాంతం పెరిగాక తలసాని స్పందించారు. ఆయన డిసెంబరు 16నే రాజీనామా ఇచ్చినట్లుగా లేఖ కూడా చూపించారు. ఇప్పుడు నింద మొత్తం ఆయనే స్వయంగా స్పీకరు మీదికి మళ్లించినట్లు అయింది. సనత్‌ నగర్‌లో ఎప్పుడు ఎన్నిక వచ్చినా గెలుస్తా అంటూ సవాలు విసిరారు కూడా. ఆ తర్వాత స్పీకరులో కదలిక వచ్చినట్లున్నది. కేసీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని పుకార్లు వచ్చాయి. ఈ దశలో ఆమోదించేస్తే.. అటు వరంగల్‌ ఎంపీస్థానంతో పాటూ సనత్‌నగర్‌ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని రెండు విజయాలు నమోదు చేయవచ్చునని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. 


ఇక అసలు విషయానికి వస్తే.. కేసీఆర్‌ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. ఎంత అద్భుతంగా పాలన సాగిస్తున్నదో, లేదా ప్రజల ఆశల్ని నీరుగారుస్తున్నదో అనే విషయంలో ప్రజలు వాస్తవంగా ఎలా ఫీలవుతున్నారో.. ఇప్పటిదాకా ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అధికార పార్టీ తమకు ఎంతో బలం ఉన్న మెదక్‌ ఉప ఎన్నికలో నెగ్గిందే తప్ప.. పట్టభద్ర ఎమ్మెల్సీల్లో మిశ్రమ ఫలితాలు చూసింది. అసలు వాస్తవంగా ఎంత అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల మద్దతు ఎంతున్నదో తెలియదు. వరంగల్‌ ఉప ఎన్నిక కూడా దీనికి ప్రామాణికం కాబోదు. అక్కడ మళ్లీ తెరాస గెలిచినా లెక్కలేదు. అదే సనత్‌నగర్‌లో తలసాని మళ్లీ తెరాస తరఫున బరిలోకి దిగి, గతంలో తెదేపా నెగ్గిన ఈ స్థానంలో ఈసారి తాను కారు గుర్తుపై విజయం సాధిస్తే.. ఆ విజయాన్ని తెరాసకు ప్రజలు పడుతున్న బ్రహ్మరథంగా గుర్తించాలి. అక్కడ పరాజయం పాలైతే... తెరాస పాలన పట్ల కొత్తగా ఎలాంటి విశ్వాసమూ ప్రజల్లో ఏర్పడలేదని అర్థం చేసుకోవాలని అని విశ్లేషకులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: