''మతపెద్దలారా.. భారతజాతి మొత్తం మీకు చేతులెత్తి మొక్కుతున్నది. మిమ్మల్నందరినీ వేడుకుంటున్నది. దయచేసి సంయమనం పాటించండి. ఎలాంటి ఆవేశ కావేషాలకు లోను కాకుండా ఉండండి. ఎవ్వరూ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయకుండా ఉండండి. ఈ దేశం పచ్చగా శాంతి భద్రతలతో ఉండడం అనేది అచ్చంగా మీ చేతుల్లో మాత్రమే ఉన్న పని. దయచేసి ఇలాంటి సందర్భాన్ని చేదు పరిణామాలతో నింపేయవద్దండి.'' అంటూ ప్రజలు మొత్తం మతపెద్దలను అభ్యర్థిస్తున్న పరిస్థితి దేశంలో ఉంది. ఒకవైపు పోలీసులు కూడా... మతపెద్దలకు ఇలాంటి అభ్యర్థనలు చేస్తున్నారు. యాకూబ్‌ మెమన్‌ను గురువారం ఉదయం ఉరి తీయనున్న నేపథ్యంలో దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా.. సునిశిత ప్రాంతాల్లో అంతా పోలీసులు అలర్ట్‌ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉరి అనంతరం మతపెద్దల వ్యాఖ్యల్లోనే.. ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు దాగి ఉంటాయనే ఉద్దేశంతో.. పోలీసులు నేరుగా వారినే ఉద్దేశించి విజ్ఞప్తులు చేస్తున్నారు. హిందూ ముస్లిం రెండు మతాలకు చెందిన పెద్దలూ సంయమనం పాటిస్తేనే.. దేశంలో శాంతిభద్రతలు బాగుంటాయని చెబుతున్నారు. 


ఇదేదో కేవలం ముస్లిం మతపెద్దలకు మాత్రమే చేస్తున్న విజ్ఞప్తి అనుకుంటే చాలా పెద్ద పొరబాటు. ఉరిశిక్ష అనుభవించి మరణించబోతున్న వ్యక్తి ముస్లిం గనుక.. ఆ మతానికి చెందిన వారిలో కొంత ఆవేదన ఉండడం సహజం. చేసిన నేరం తప్పొప్పుల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. డెత్‌ సెంటెన్స్‌ అంటే సహజంగా వ్యక్తమయ్యే సానుభూతి కొంత ఉంటుంది. అలా వారి మాటల్లో కూడా ఆవేదన దొర్లవచ్చు. కానీ అది ఆవేశం రూపం సంతరించుకోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మత పెద్దలమీదే ఉంటుంది. మతపెద్దల మాటలు, సందేశాలు, ఉపదేశాలు అంటే.. వెర్రెత్తిపోయి వాటిని గుడ్డిగ అనుసరించే యువతరం చాలా పెద్దసంఖ్యలోనే ఉంటుంది. ఈ విషయాన్ని పెద్దలు గుర్తుంచుకోవాలి. యాకూబ్‌ మెమన్‌ ఉరిశక్ష గురించి మాట్లాడేప్పుడు.. తాము ఒక ముస్లిం ఉరి గురించి కాకుండా.. ఒక తీవ్రవాది ఉరి గురించి మాత్రమే మాట్లాడుతున్నామనే స్పృహ ఉంటే ఇబ్బంది ఉండదు. 


అలాగని హిందూ మతపెద్దల వల్ల వివాదాలు రేగవు అనుకోవడానికి కూడా వీల్లేదు. కొన్నిరోజుల కిందట అసదుద్దీన్‌ ఒవైసీ ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఓ వ్యాఖ్య చేస్తే.. ఆరెస్సెస్‌ మరికొందరు హిందూ నాయకులు ఎలాంటి తీవ్రమైన వ్యాఖ్యలతో ప్రతిస్పదించారో అందరికీ తెలుసు. ఉరి తర్వాత.. హిందూ సంస్థలకు చెందిన వారు కూడా ఎవ్వరూ అలాంటి దుందుడుకు ప్రకటనలు చేయకుండా ఉంటే మంచిది. మెమన్‌ ఉరితీయడాన్ని చాలా అద్భుతమూ మరియు మహిమాన్వితమైన విషయంగా అభివర్ణించే అత్యుక్తుల్ని వారు మానుకోవాలి. 


ప్రథానంగా ఇరు మతాలకు చెందిన పెద్దలు సంయమనం పాటిస్తే శాంతి భద్రతల్ని కాపాడిన వారవుతారు. దేశసౌభాగ్యాన్ని రక్షించిన వారవుతారు. అందుకే మతపెద్దలారా.. దయచేసి.. సంయమనం కోల్పోయి దుడుకు ప్రకటనలు చేయకుండా ఉండమని భారతీయులందరి తరఫునా ఇది విజ్ఞప్తి. 


మరింత సమాచారం తెలుసుకోండి: