యాకూబ్‌ మెమన్‌ తరఫున అన్ని రకాల ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తూ.. అతడిని ఉరితీయడానికి నిర్ణయించిన సమయానికి సరిగ్గా రెండు గంటల ముందు సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్‌ చివరి తీర్పును వెలువరించింది. బుధవారం అర్ధరాత్రి వేసిన పిటిషన్‌ను తెల్లవారుజాము 3.30 నుంచి విచారించి, గంటకు పైగా ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం బెంచ్‌ దానిని కూడా తిరస్కరించింది. దీంతో మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు అయినట్లే. తెల్లవారుజాము... 4.50 గంటల సమయంలో అతడి పిటిషన్‌ తిరస్కరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉదయం 7 గంటలకు ఉరి అమలవుతుంది. 


దింపుడు కళ్లెం ఆశలు చెల్లు 

మరణించిన వాడిని శ్మశానానికి తీసుకువెళ్లిన తర్వాత.. పాతిపెట్టడానికి ముందు.. గోతి పక్కనే శవాన్ని ఉంచి.. మూడుసార్లు చెవిలో పేరుపెట్టి పిలుస్తారు. అలా పిలిస్తే లేచి వస్తాడని ఒక ఆశన్నమాట. దీనినే 'దింపుడు కళ్లెం ఆశ' అంటారు. యాకూబ్‌ మెమన్‌ ఉరిశిక్ష విషయంలో కూడా అతని న్యాయవాదులు.. అలాంటి దింపుడు కళ్లెం ఆశలను ఇంకా విడచిపెట్టడం లేదు. ఉదయం 7 గంటలకు యాకూబ్‌ను ఉరితీయడానికి నాగ్‌పూర్‌ జైల్లో ఏర్పాట్లు అన్నీ జరిగిపోతుండగా.. న్యాయపరమైన హక్కుల్ని కాలరాస్తున్నారంటూ సుప్రీంలో ఒక పిటిషన్‌ వేసి.. న్యాయమూర్తుల్ని అర్ధరాత్రి కదిలించి.. ఉదయం 3.30 గంటలకు సుప్రీం కోర్టును పనిచేసేలా చేశారు. ఉదయం 4.30 వరకు ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు బెంచ్‌ ఈ విషయంలో వీరి మరియు ప్రభుత్వ అటార్నీ జనరల్‌ వాదనలను విన్నది. తీర్పు వెలువడాల్సి ఉంది. 


న్యాయపరంగా యాకూబ్‌కు ఉండే హక్కుల్ని వాడుకుంటున్నాం అంటూ వాదించిన లాయర్లు.. క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు ఉరికి మధ్య 14రోజుల కనీస గడువు ఉండాలి కదా.. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ కాపీ తమకు ఇంకా అందలేదని ఇలాంటి కారణాలను న్యాయవాదులు కోర్టు ముందు వినిపించారు. అయితే వీటిని ప్రభుత్వ అటార్నీ జనరల్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. 


అలాంటప్పుడు శిక్షపడిన 2014లోనే దీనిని ఎందుకు సవాలు చేయలేదంటూ ఏజీ ప్రశ్నించారు. పదేపదే పిటిషన్లు వేస్తే ఎలా వస్తుంది. పైగా ఉరికి పదిగంటల ముందు పిటిషన్‌ వేసి.. 14రోజుల వ్యవధి కావాలని ఎలా అడుగుతారు? అంటూ ఏజీ వాదించారు. మొత్తానికి ఉరి సమయానికి రెండు గంటల ముందు దీనికి సంబంధించిన తుదివిచారణ ఉత్కంఠ కూడా ముగిసింది. ఇక అంతిమంగా ఉరి శిక్ష ఖరారైనట్లే. 


మరింత సమాచారం తెలుసుకోండి: