ఇప్పుడే లీకులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రివర్గం విస్తరణకు సంబంధించిన పుకార్లు ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ వర్గాలే దీనికి సంబంధించి.. 'ఫీడ్‌బ్యాక్‌' తెలుసుకోవడం కోసం లీక్‌లు ఇచ్చినట్లుగా ఈ విస్తరణకు సంబంధించిన వార్తలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారు. నిజానికి ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో ఏర్పడని మంత్రివర్గాన్ని తప్పక విస్తరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రక్రియ రెండు నెలల తర్వాత అనగా సెప్టెంబరులో జరుగుతుందనేది తాజా లీక్‌. ఎవరి ఉద్దేశాలు, ఆశలు భయాలు ఎలా ఉన్నాయో పసిగట్టేందుకే ఇంత ముందుగా పుకార్లు వదిలారని అనిపిస్తోంది. 


చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ప్రస్తుతం 20 మంది మంత్రులున్నారు. నిజానికి సంఖ్యాపరంగా 26 మంది ఉండడానికి అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత.. మంత్రి పదవుల ఆశలు పెంచుకుంటున్న వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే.. తమను తము మంత్రిపదవికి అర్హులుగా భావించేవాళ్లు, గతంలో ఆ పదవులు చేశాం గనుక.. మళ్లీ తమ సీనియారిటీకి గుర్తింపు ఉంటుందనుకునేవాళ్లు.. ఇలాంటి వాళ్లు అనేకులు గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా దెబ్బకు బోల్తా పడ్డారు. అయినా సరే.. తన పార్టీకి అయినవాళ్లు గనుక.. అలాంటి చాలా మందికి చంద్రబాబునాయుడు.. ఎమ్మెల్సీలుగా గెలిచే అవకాశం కల్పించి ఇటీవలే చట్టసభలకు తీసుకువచ్చారు. వారిలోనే చాలా మంది మంత్రి పదవుల మీద ఆశలు పెంచుకుంటున్నారు. ఉదాహరణకు ఈ జాబితాలో గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్‌, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మరి కొందరు ఉన్నారు. 


అయితే చంద్రబాబునాయుడు కేవలం కొత్త మంత్రిపదవులు ఇవ్వడం మాత్రమే కాదని, కొందరిని తొలగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం కొలువుల్లో ఉన్న పలువురిలో భయం దోబూచులాడుతోంది. తొలగించదలచుకుంటే బాబు నిష్కర్షగా వ్యవహరిస్తారని వారు భయపడుతున్నారు. 


కొత్త పదవులు ఇవ్వడానికి పార్టీకి చేసిన సేవ, ప్రతిపక్షాన్ని ఎండగట్టగల చేవ కొలమానాలుగా చూసుకుంటున్న చంద్రబాబు.. తొలగించడానికి మాత్రం.. అవినీతి, అసమర్థత ప్రాతిపదికలు గా తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆగస్టు నెల మొత్తం చంద్రబాబు విదేశీ పర్యటనలతోనే గడచిపోనుంది. ముందుగా ఫ్యామిలీతో విదేశీ టూర్‌, తర్వాత.. ఆస్ట్రేలియాకు అధికార పర్యటన ఇలా చంద్రబాబు షెడ్యూలు ఉంది. ఆగస్టు 31నుంచి సెప్టెంబరు 4 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఆ ఘట్టం పూర్తయ్యాకే మంత్రివర్గం విస్తరణ ఉంటుందిట. ఈలోగా.. ఈ విషయంలో ఎవరెవరి అంచనాలు ఎలా ఉన్నాయో చంద్రబాబు ఆరా తీసి పెట్టుకుంటారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: