తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్‌ లభించింది. ఫోను ట్యాపింగ్‌ వ్యవహారంలో విజయవాడ కోర్టులో జరుగుతున్న సిట్‌ పిటిషన్‌ విచారణ, వారినుంచి హైదరాబాదులోని సెల్‌ కంపెనీల వారికి వచ్చిన కోర్టు ఉత్తర్వులు.. నేపథ్యంలో తాము నిర్వహించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలకమైన విషయాలు అన్నీ బయటకు వస్తాయని భయపడిన తెసర్కార్‌.. విజయవాడ కోర్టు లో విచారణనే ఆపు చేయించాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈకేసులో ప్రస్తుతానికి వారు కోరుకున్నట్లు తీర్పు రాకపోయినా.. వచ్చిన తీర్పుతో కాస్తంత రిలీఫ్‌ లభించినట్లే. తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన కాల్‌డేటా వివరాల్ని తమకు కూడా ఇవ్వాలంటూ సెల్‌ కంపెనీలకు విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. 


చంద్రబాబునాయుడు ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి తన రాద్ధాంతం మొదలుపెట్టినప్పుడు.. అసలు అలాంటిదేమీ జరగనేలేదంటూ.. తెలంగాణ సర్కారు బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే తెసర్కార్లో ఏయే అధికారులు ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి సెల్‌ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చారో.. ఆ లేఖలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు మరో బాంబు పేల్చారు. దీంతో సంబంధం ఉన్న చాలామంది అధికార్లు సెలవుపై వెళ్లిపోయారు. అటు ఏపీలో సిట్‌ ఏర్పాటుచేసిన చంద్రబాబు సర్కారు సెల్‌ కంపెనీలకు నోటీసులు ఇచ్చి కోర్టు ముగ్గులోకి లాగింది. తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన కాల్‌డేటా వివరాలు విజయవాడ కోర్టుకు ఇవ్వలేం అంటూ సెల్‌కంపెనీలు చెప్పాయి. అలా ఇస్తే అక్కడి ప్రభుత్వం కేసులు పెడుతుందని చెప్పాయి. అయితే విజయవాడ కోర్టు వారికి కాల్‌ డేటా వివరాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. 


ఇందులో నిజానికి ఇబ్బంది సెల్‌ కంపెనీ ఆపరేటర్లది. అయితే వారు తె- ప్రభుత్వానికి ఇచ్చిన కాల్‌డేటాను విజయవాడ కోర్టుకు ఇస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వమూ ఇరుకున పడుతుంది. అందుకే వీరు ముందుకువచ్చి హైకోర్టును ఆశ్రయించారు. ఉద్ధండపిండం వంటి న్యాయవాది రాంజెఠ్మలానీ ని ప్రభుత్వం తరఫున వాదించడానికి పిలిపించారు. ఇవాళ కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. సాయంత్రం హైకోర్టు తీర్పు వెలువరించింది. విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రత్యేక సీల్డుకవర్‌లో వివరాలు అన్నిటినీ హైకోర్టుకు అందజేయాలని ఆదేశించింది. విజయవాడ కోర్టు వారు అడిగిన 25 మంది కాల్‌డేటా వివరాలను ప్రత్యేక సీల్డు కవర్‌లో ఆ కోర్టుకు అందించిన తర్వాత.. వాటిని ప్రత్యేక మెసెంజర్‌ ద్వారా.. హైకోర్టుకు అందజేయాలంటూ హైకోర్టు పేర్కొన్నది. 


ఈ తీర్పు కేసీఆర్‌ సర్కారుకు తాత్కాలిక ఊరట మాత్రమే అవుతుంది. ఒకసారి ప్రభుత్వానికి ఇచ్చిన 25 మంది కాల్‌డేటాను సెల్‌ కంపెనీలు.. ఏదో ఒకరూపంలో హైకోర్టుకు అయినా అందజేస్తే.. ఇక అది బహిరంగం అయిపోయినట్లే. అయితే హైకోర్టు తదుపరి విచారణను నాలుగువారాలు వాయిదా వేసింది. తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: