ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు ఇంకా వేగం పుంజుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో తెరవెనుకనుండి నడిపించిన అసలు పెద్దతలకాయలు ఎవరనేది కూడా కొన్నిరోజుల్లో ముడి వీడిపోనున్నదని.. వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న దర్యాప్తు క్రమాన్ని పరిశీలించినట్లయితే.. అసలు ఓటుకునోటు వ్యవహారాన్ని నడిపించిన తెలుగుదేశం నాయకుల అజాగ్రత్త చర్యలే ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్నట్లుగా అర్థమవుతోంది. సెబాస్టియన్‌ తాను జరిపిన ఫోను సంభాషణల్ని తన ఫోనులోనే రికార్డు చేయడమే ఏసీబీ పోలీసులకు దొరికిన అతిపెద్ద ఆధారాలుగా చెప్పుకోవాలి. రేవంత్‌రెడ్డి డబ్బు ఆఫర్‌ చేస్తూ దొరికిన వీడియో ఫుటేజీల తర్వాత అత్యంత కీలక ఆధారాలు సెబాస్టియన్‌ ఫోనులోని ఆడియో సంభాషణలే. ఇప్పుడు సెబాస్టియన్‌ ''ఫోను నెం.2'' లోని రికార్డులు.. పార్టీలోని అసలు పెద్దతలకాయల జాతకాలను బయటకు తెస్తాయని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం. 


సెబాస్టియన్‌ ఫోనులో సంభాషణలు ఆయనే రికార్డు చేసి ఉంచుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. ఆ ఫోన్లను స్వాధీనం చేసుకోగా, రికార్డు అయిన కాల్స్‌ ద్వారా చాలా వివరాలు తెలిసాయి. సండ్ర పాత్ర గురించి కూడా అలాగే తెలిసింది. అయితే ఆ ఫోనులో ఎక్కువగా సండ్ర పాత్ర గురించే తప్ప... ఎక్కువ వివరాలు అందలేదు. ఆ రికార్డులు అన్నిటినీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి.. ఆ నివేదికలు కూడా తెప్పించారు. ధ్రువీకరింపజేసుకున్నారు. అయితే సెబాస్టియన్‌ వద్ద రెండో ఫోను కూడా ఉన్నదిట. అది ఆధునిక టెక్నాలజీ ఫోను. అందులోని రికార్డింగ్‌లను డీకోడ్‌ చేయడం ఏసీబీకి కుదర్లేదు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఇచ్చినా వారు వెంటనే చేయలేకపోయారు. 


ఇప్పుడు ఆ రెండో ఫోనుకు అవసరమైన ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను తెప్పించి... దాని ద్వారా మొత్తం వివరాల్ని ఏసీబీ పోలీసులు రాబడుతున్నట్లు సమాచారం. సెబాస్టియన్‌ ఆ రెండో ఫోనుతోనే పెద్దవాళ్లతో సంభాషణలు జరిపేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌నుంచి దీనికి సంబంధించిన నివేదికలు వచ్చాయంటే.. ఇక ఓటుకు నోటు కేసు వేగం పుంజుకుంటుందని... సంచలనాత్మక అరెస్టులు కూడా ఉంటాయని పలువురు అనుకుంటున్నారు. ఈ వివరాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రముఖులకు కూడా ఏసీబీ నోటీసులు జారీచేస్తుందని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: