తెలుగు పత్రికల చరిత్ర చెప్పుకునే సమయంలో ఈనాడుకు ముందు ఈనాడు తర్వాత అని చెప్పుకోవడం కామన్.. తెలుగు పత్రికారంగంలో ఈనాడు వేసిన ముద్ర అలాంటింది. అయితే.. ఈనాడు తర్వాత మళ్లీ ఆ తరహాలో చరిత్ర సృష్టించిన పత్రిక సాక్షి అని చెప్పుకోవచ్చు. ఈనాడు ఏళ్ల తరబడి క్రమంగా సంపాదించుకున్న రేంజ్, రీడర్ షిప్ లను సాక్షి..అంతకంటే చాలా తక్కువ సమయంలో సంపాదించింది. ఈనాడును దాటేయకపోయినా.. కంగారు పెట్టగలిగింది. 

సాక్షి ప్రారంభించిన మొదట్లో.. ప్రభుత్వంపైన, కాంగ్రెస్ నాయకులపైన, వైఎస్ కుటుంబంపైనా ఈనాడులో ఏమైనా నెగిటివ్ వార్తలు వస్తే.. వెంటనే కౌంటర్ వార్తలు ప్రచురించేది. అంతేకాదు.. ఇలాంటి వార్తలకు సంబధీకుల వివరణ తీసుకోవద్దా అంటూ విమర్శించేది. తాము మాత్రం ఏ వార్త అయినా వివరణ తీసుకునే వేస్తామని..  జర్నలిజం విలువలు పాటిస్తామని సన్నాయి నొక్కులు నొక్కేది.  

ఊరికే చెప్పడమే కాదు.. అప్పట్లో టీడీపీకి చెందిన వార్తలైనా.. రామోజీకి చెందిన వార్తలైనా సాక్షి వివరణలతో ప్రచురించేది. వారు వివరణ ఇవ్వడానికి నిరాకరిస్తే వార్తలో ఆ విషయం ప్రస్తావించేది. ఐతే.. మొదట్లో ఉన్న శ్రద్ధ తగ్గిపోయిందో.. వేడి చల్లారిందో తెలియదు గానీ.. ఇప్పుడు సాక్షి కూడా ఎలాంటి వివరణలు తీసుకోకుండానే వార్తలు ధారాళంగా ప్రచురిస్తోంది. లెటెస్టుగా కృష్ణా జల్లా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు గంపలగూడెం మండలంలో క్వార్ట్ మైనింగ్ కోసం ప్రభుత్వం అక్రమంగా లీజు కట్టబెట్టిందంటూ వార్త ప్రచురించింది.     

ఈ వార్తపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్రంగా స్పందించారు. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దంటూ మండిపడ్డారు. ఈ లీజు ఇప్పటిది కాదని.. తాను 2010 లోనే దరఖాస్తు చేసుకుంటే.. గతేడాది జనవరి నాటికి అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల హడావిడిలో ఉన్న తాను.. ఇటీవల పనులు మొదలుపెట్టానని వివరణ ఇచ్చారు. ఇలాంటి వార్తలు వివరణ లేకుండా ఎలా రాస్తారని మండిపడ్డారు. ఔను మరి.. అప్పట్లో ఈనాడుకు బుద్ధి చెప్పిన సాక్షి ఇప్పుడు చేస్తున్నదేంటో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: