ఆంధ్రాకు సీఎం అయిపోదామని కలలు కన్న కుర్రాడు జగన్.. ప్రతిపక్షనాయకుడి పాత్రతో అడ్జస్టు కావాల్సి వస్తుంది. పోనీలే..అంతగా అనుభవం లేదు కదా.. ఈ పాత్రతోనైనా కాస్త జనం మధ్య తిరుగుతాడు.. జనం కష్టాలు తెలుసుకుంటాడు.. జన రాజకీయం నేర్చుకుంటాడు అని ఆయన శ్రేయోభిలాషులు ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ జగన్ వారి అంచనాలను ఇప్పటివరకైతే పెద్దగా చేరుకున్నట్టు కనిపించడం లేదు. 

ఎప్పుడో.. ఒకటీ అరా దీక్షలు చేయడం తప్ప.. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజాపోరాటాలు చేయడం పట్ల ఎందుకో జగన్ కు అంత ఆసక్తి లేనట్టుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అడపాదడపా ప్రెస్ మీట్లు.. మూడు నెలలకో ఆరు నెలలకో ఓ దీక్ష చేస్తే ఆయనపై జనం పెట్టుకున్న ఆశలు నెరవేరవు. 

ఇప్పుడు తాజాగా వైసీపీ ప్ర్తత్యేక హోదాపై పోరాడాలని ఓ మంచి నిర్ణయం తీసుకుంది. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఆశ చూపిన.. బీజేపీ ఇప్పుడు.. ఏరు దాటాక తెప్ప తగలేస్తున్న సంగతి ఆంధ్రాజనం గుండె మండిస్తోంది. మరోవైపు ఆ పార్టీతో అధికారం పంచుకుంటూ హోదా గురించి పోరాడలేని ఆశక్తత, అసమర్థత టీడీపీకి మైనస్ పాయింట్ గా మారుతోంది. ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నా.. అది సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. 

ఈ సమయంలో ప్రత్యేక హోదా కోసం ఆగస్ట్ 10న జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని జగన్ నిర్ణయించడం కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్యే. పనిలో పనిగా టీడీపీనీ ఇరుకున పెట్టినట్టు అవుతుంది. ముందు ముందు హోదా వస్తే .. మేం పోరాడామనీ చెప్పుకోవచ్చు. కాకపోతే.. ఒక్క రోజు ఢిల్లీ దీక్షతో వదిలేయకుండా.. ఈ పోరాటాన్ని ఇక్కడ ఏపీలోనూ.. అక్కడ ఢిల్లీలోనూ ఉధృతం చేసి.. ఇష్యూను ఓ దారికి తెస్తే.. అది వైసీపీకి గొప్ప ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఆ దిశగా జగన్ ప్లాన్ చేస్తారా.. లేదా.. అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: