రాజకీయ నాయకుడంటే.. జనం కోసం నిరంతరం పని చేయడమే కాదు.. అలా పని చేస్తున్నట్టు కనిపించాలి కూడా. నిత్యం ఏదో అభివృద్ధి జరిగిపోతోందన్న భ్రమలు కల్పించాలి.. ఇవి రాజనీతి గురించి అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పిన మాటలు. ఈ మాటలను అక్షరాలా అమలు చేయడంలో ఎప్పుడూ ముందుడే నాయకుడు ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. నిత్యం ఏదో ఒక ప్రాజెక్టు పేరు చెబుతూ ఆయన పని జరిగిపోతోందన్న సీన్ క్రియేట్ చేయడంలో ఆయన్ను మించినవారు లేరు. 

అసలే లోటు బడ్జెట్ తో అధికారం చేతికందింది. ఆదాయం అంతంతమాత్రం.. కేంద్ర సాయమూ అంతంతే.. అయినా.. ఆయన మైనస్ పాయింట్లను తనకు అనుకూలంగా మలచుకుంటున్న తీరు అద్వితీయం.. పైసా చేతి నుంచి ఖర్చు చేయకుండానే రాజధాని కోసం 30వేల ఎకరాల భూమి సేకరించేశారు. ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే.. ఆంధ్రా జనం మెదళ్లలో సింగపూర్ ను తలదన్నే అమరావతి రాజధాని కట్టేశారు. దటీజ్ చంద్రబాబు.

అందుకేనేమో ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు రూట్లోనే వెళ్దామని అనుకుంటున్నట్టున్నారు. జపాన్, సింగపూర్, చైనా, మలేసియా.. ఇవీ చంద్రబాబు నోటి నుంచి తరచూ వచ్చే పదాలు.. ఆయా దేశాలు అభివృద్ది చెందిన తీరు గురించి చంద్రబాబు తరచూ చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సింగపూర్ జపం పలుకుతున్నారు. సింగపూర్ దేశం మంచినీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి నుంచి.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని కేసీఆర్ తెగ పొగిడేస్తున్నారు. 

సింగపూర్ దేశాన్ని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ కూడా ముందుకు సాగాలని కేసీఆర్ అధికారులకు పిలుపు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల సమావేశంలో ఆయన సింగపూర్ మంత్రం పఠించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను సమర్ధంగా తయారు చేయాలని, దాని ద్వారా గ్రామాలను అబివృద్ది చేయాలని.. గ్రామాలకు ప్రణాళికలు రూపొందించాలని , వాటిలో బాగా పనిచేసే గ్రామాలకు అవార్డులు ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. ఐతే సింగపూర్ వంటి దేశాల్లో పారదర్శకత ఎక్కువ, అవినీతి తక్కువ, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు సృష్టించడం అసలే లేదు.. అన్న విషయాలు కేసీఆర్, చంద్రబాబులకు తెలియనివి కాదు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: