ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆంధ్రా సర్కారుకు చెందిన 120 మంది ప్రముఖుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఓటుకు నోటు కేసులోని సాక్షి స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో రికార్డులు వెలుగు చూసిన సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదమూ వెలుగుచూసింది. ఓటుకు నోటు కేసు నుంచి దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ఊరికే ఈ ట్యాపింగ్ కోణం ఎత్తుకున్నారని విమర్శలు వచ్చాయి.  

కానీ చంద్రబాబు సర్కారువు ఉడత ఊపులు కావని.. పక్కా ఆధారాలతోనే బరిలో దిగిందని క్రమంగా అర్థమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఊపందుకోవడంతోనే.. ఇటు తెలంగాణలోని ఓటుకు నోటు కేసు నామమాత్రంగా మారిపోయింది.. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదని కేసీఆర్ అరచిగీపెట్టినా.. కనీసం స్వర పరీక్షనోటీసు కూడా ఇవ్వలేకపోయారు. అంతేకాదు.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారే ఇరుక్కుపోయేలా కనిపిస్తోంది.  

ఇన్నాళ్లూ మేం ఫోన్ ట్యాపింగ్ చేయనేలేదని వాదించిన తెలంగాణ సర్కారు.. ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చేసింది. తాము ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమేనని.. కానీ అసాంఘిక శక్తులను అదుపు చేసేందుకు మాత్రమే ట్యాపింగ్ చేశామని.. హైకోర్టు ముందు వాదిస్తోంది. అంతేకాదు.. గంటకు పది లక్షల రూపాయల ఫీజు తీసుకుంటారని పేరున్న రాంజెత్మలానీ వంటి లాయర్ ను తన వాదనలు వినిపించేందుకు పెట్టుకుంది. 

ఫోన్ ట్యాపింగ్ కాల్ డేటా ఇవ్వాలన్న ఏపీ సర్కారను అభ్యర్థనపై సెల్ ఫోన్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. అటు తెలంగాణ సర్కారు డాటా ఇవ్వొద్దంటోందని.. ఇటు ఆంధ్రాసర్కారు ఇవ్వమంటోందని.. మధ్యతో తమను మద్దెల ఆడేస్తున్నారన్నది ఆయా సంస్థల గోడు. మొత్తానికి ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఇక్కడే సీన్ రసకందాయంలో పడింది. మొదటి నుంచి ట్యాపింగ్ చేయలేదని వాదిస్తున్న తెలంగాణ తాము ట్యాపింగ్ చేస్తున్నామని ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఈ కేసుపై హైకోర్టు స్టే విధించడంతో టీ సర్కారు కాస్త ఊపిరి పీల్చుకుంది. ఐతే.. విజయవాడ  కోర్టుకు సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటా వివరాలు ఇచ్చాక, వాటిని సీల్డ్ కవర్ లో ప్రత్యేక మెసెంజర్ ద్వారా తమకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో తనను అరెస్టు చేయాలని చూస్తే తెలంగాణ సర్కారు కూలిపోతుందంటూ చంద్రబాబు అల్టిమేటమ్ జారీ చేశారు. అంటే.. ఇప్పుడు తెలంగాణ సర్కారును కూల్చే వాస్తవాలు.. సీల్డ్ కవర్లో హైకోర్టు చేతికి చేరతాయన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: