ఫోన్ ట్యాపింగ్ కేసుతో.. ఓటుకు నోటు కేసు చెల్లు.. అన్న రీతిలో ఇటీవలి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు రాజీకి రావడం వల్లే ఈ రెండు కేసులు నత్తనడకన సాగుతున్నాయని రూమర్లు వచ్చాయి. ఇద్దరు ముఖ్యమంత్రులకూ కేంద్రం రాజీ కుదిర్చిందని మరో టాక్ వినిపించింది. ఈ రెండు కేసుల్లో పెద్దగా దూకుడు లేకపోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది. 

ఐతే.. ఇప్పుడు మళ్లీ సీన్ మారుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అంశాన్ని తెలంగాణ ఏసీబీ సీరియస్ గా పరిశీలిస్తోందట. ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపుల్లోని గొంతులను సరిపోల్చుకునేందుకు ఆయా వ్యక్తుల స్వర నమూనాలు సేకరించాలన్న అభిప్రాయానికి వచ్చారట. అయితే స్వరపరీక్ష కోసం ఆడియో, వీడియో టేపుల్లోని వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని అనుకున్నా.. ప్రస్తుతానికి వారి గత రికార్డుల పరిశీలన ద్వారానే నిర్థారిస్తారట. 

ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్నరేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేలు కావడంతో.. వారి స్వర నమూనాలను అసెంబ్లీలో వారు వివిధ సందర్భాల్లో మాట్లాడిన వీడియో రికార్డులనుంచి తీసుకుంటారట. ఇక సెబాస్టియన్, మత్తయ్యల స్వరాలను నిర్థారించుకునేందుకు వారు గతంలో వివిధ చానళ్లతో వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన టేపులను ఆయా చానళ్ల నుంచి సీఆర్‌పీసీ 91వ సెక్షన్ కింద తీసుకుంటారట. ఇలా సేకరించినవన్నీ మళ్లీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపుతారన్నమాట. 

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు జరిపిన ప్రయత్నంలో సెబాస్టియన్ వాడిన రెండు సెల్‌ఫోన్లలో ఒకదానిలో ఎమ్మెల్యే సండ్ర సంభాషణలు బయటపడ్డాయి. రెండవ సెల్‌ఫోన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన సంభాషణ ఉన్నాయి. మరి.. చంద్రబాబు స్వరాన్ని ఆయన ఇటీవల మాట్లాడిన సభల రికార్డులతో పోల్చే అవకాశం ఉంది. ఆ స్వరాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ధ్రువీకరిస్తే.. అప్పుడు చంద్రబాబు సహా దాదాపు పది మందికి సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు పంపించే అవకాశం ఉందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: