రాజకీయనాయకులు ఎప్పుడూ తమ తమ ప్రయారిటీస్‌ను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. షెడ్యూలును నిర్ణయించుకుంటూ ఉంటారు. చంద్రబాబునాయుడు... రాజమండ్రి పుష్కరాలను తాను దగ్గరుండి నిర్వహించడం ఎక్కువ ప్రయారిటీ అనుకున్నారు గనుకనే.. ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన నీతిఆయోగ్‌ ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఎగ్గొట్టారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఎంచుకుంటున్న ప్రయారిటీస్‌ ఏమిటి? ఒకవైపు కేంద్రమంత్రి ప్రకటనతో ఏపీకి ప్రత్యేకహోదా అసాధ్యం అని ప్రజలు ఆవేదన చెందుతుండగా, చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా.. కేంద్రంతో పోరుబాట పనికిరాదు. సానుకూలంగా ఉండి చక్కబెట్టుకుందం అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మంచిదే కానీ ఆ పని అయినా చేయాలి కదా.. కానీ చంద్రబాబునాయుడు ప్రయారిటీ మాత్రం ముందుగా ఫ్యామిలీతో కలిసి టర్కీకి వెళ్లడం మీదనే ఉంది. టర్కీ వెళ్లి వచ్చిన తర్వాతే.. ఆయన ప్రధాని వద్దకెళ్లి హోదా గురించి మాట్లాడుతారట. 


తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఇంకా ఎంతకాలం పాటూ 'మనకు వస్తుంది.. మన రాష్ట్ర పరిస్థితి వేరు' అని మాయ మాటలు చెబుతూ.. ప్రజల్ని మోసం చేయవచ్చునని అనుకుంటున్నారో గానీ.. అలాంటి మోసం వల్ల జరిగే నష్టాన్ని వారు తెలుసుకోగలుగుతున్నారో లేదో అర్థం కావడం లేదు. నిజంగా ప్రధానితో మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉంటుదని, ప్రత్యేకహోదా వచ్చే అవకాశం ఉన్నదని సీఎం చంద్రబాబుకు ఒక అభిప్రాయం ఉంటే.. దానికి సరైన సమయం ఎప్పుడు? ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వాధినేతలు మాట్లాడే మాటలకు ఒక విలువ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడి... ఆయన ద్వారా పురమాయింపజేసి.. సంబంధిత మంత్రితో ఒక ప్రకటన చేయిస్తే ఎంత బాగుంటుంది. 


చంద్రబాబు అలా కాకుండా ఫ్యామిలీతో టర్కీ టూర్‌ ముగిసిన తర్వాత.. నిదానంగా ప్రయాణబడలిక కూడా తీర్చుకుని తర్వాత ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆలోగా పార్లమెంటు కూడా పూర్తవుతుంది. జగన్‌ చేయబోయే ధర్నాకూడా పూర్తవుతుంది. ఆనక చంద్రబాబు వెళ్లి కలుస్తారు. మోడీ ఇంటినుంచి బయటకు వచ్చి.. 'న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు' అంటూ.. ప్రత్యేక హోదా ''ఇస్తారా? ఇవ్వరా?'' తేల్చకుండా ఒక పడికట్టు డైలాగు మీడియాకు అప్పజెప్పి మానుకుంటారు. అంతే దాని గురించి మళ్లీ ఇక చర్చ జరగదు. ఇలా మోసం చేసే బదులు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ప్రధానితో మాట్లాడితే లాభం ఉంటుందని అనుకుంటే.. ముందుగా ఆ పని పూర్తిచేసి తర్వాత టర్కీ వెళ్తే ఎలా ఉంటుంది? అనుకుంటున్నారు జనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: