విభజన కారణంగా విపరీతంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందే.. వచ్చి తీరాల్సిందే.. ఇది టీడీపీ నేతల ఉవాచ.. వైసీపీ నేతలూ అంటున్నది అదే.. అటు వామపక్షాలూ అరిచిమొత్తుకుంటున్నదీ అదే.. చివరకి ఏపీలో తమ ప్రాతినిధ్యం గుండు సున్నా అయినా రాహుల్ గాంధీ చెబుతున్నది.. పోరాడుతా అని సమరభేరీ మోగిస్తున్నదీ దాని గురించే. అందరితో పాటు .. చివరకు ఏపీలోని బీజేపీ నేతలూ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరాల్సిందే అంటున్నారు. 

సో.. ప్రత్యేక హోదాపై ఏపీలో ఏకాభిప్రాయం వెల్లువై పోర్లుతోందన్నమాట. మరి అంతా ఓకే అంటున్నారు.. ఇక్కడి కమలనాథుల సంగతేమో కానీ.. కేంద్రం కుర్చీల్లో పీఠం వేసుక్కూర్చున్న కమలనాథులు మాత్రం.. హోదా గీదా జాంతానై అంటున్నారు. ఇక్కడ ఇంత బాగా వాయిస్ రైజ్ చేసే ఏపీ బీజేపీ నాయకులు ఢిల్లీలో మాత్రం నోరు మెదపరు. మరి హోదా వచ్చేదెలా.. ఆంధ్రుల చిరకాల వాంఛ తీరేదెలా..! 

ఎటూ ఎడతెగని ఈ సమస్యకు వైసీపీ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు ఓ సింపుల్ పరిష్కారం చెప్పేస్తున్నారు. అదేంటయ్యా అంటే.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయుకులు ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలోని బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధర్నాలు చేసేద్దామంటున్నారు. ఊరికే హైదరాబాద్ లో పార్టీ కార్యాలయాల్లో కూర్చుని హోదా ఇవ్వాలి.. ఇచ్చేయాలి.. అంటూ మీడియా పులుల్లా రెచ్చిపోకుండా యాక్షన్ లోకి దిగిపోదామంటున్నారు. అంతేకాదు.. ఇదేదో కొత్త డిమాండ్ కాదు.. ఎన్నికల ముందు మీరిచ్చిందే కదా అని నిలదీద్దామంటున్నారు. 

ఈ ఐడియా ఏదో బాగానే ఉంది.. అలానే కానిద్దాం అంటున్నారు.. అసలే ధర్నాలు, రాస్తారోకోలు అంటే.. యమా ఇంట్రస్టు చూపుతున్న వైసీపీ నాయకులు. అసలే ఈ మధ్య ఉద్యమాల జోరులేక చప్పబడిపోయిన వామపక్షాలు కూడా సై సై అంటున్నాయి. అయితే.. వినడానికి బాగానే ఉంది కానీ.. హోదా గీదా ఇవ్వంపో అని పార్లమెంటులోనే తేల్చి చెప్పేసిన మంత్రులు.. ఇళ్ల ముందు ధర్నా చేస్తే మాత్రం హోదా ఇచ్చేస్తారా.. ఇదంతా మనల్ని బద్నాం చేసే ప్లాన్ కాకపోతే.. అంటూ జాయింటుగా గుసగుసలాడుకుంటున్నారు టీడీపీ-బీజేపీ నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: