ఇటీవల మరణించిన మహా మనీషి అబ్దుల్‌ కలాంకు ఘనంగా నివాళి అర్పించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకున్నారు. అబ్దుల్‌ కలాం ఫిజిక్స్‌ శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో.. హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన సంస్థ (డీరఆర్‌డీఓ) లో పనిచేసిన నేపథ్యంలో ఆ సంస్థకు కలాం పేరు పెట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ కేసీఆర్‌ లేఖ రాశారు. ఇది చాలా సముచితమైన నిర్ణయం. ప్రతిష్ఠాత్మక డీఆర్‌డీవోకు కలాం డైరక్టర్‌గా పనిచేశారని, ఆయన పేరుపెట్టడం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకం అవుతుందని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. 


అబ్దుల్‌ కలాంకు హైదరాబాదులోని కేంద్ర పరిశోధన సంస్థలతో ఎంతో అనుబంధం ఉంది. డీఆర్‌డీఎల్‌, మిథాని, ఆర్‌సీఐ, ఐసీబీఏం వంటి సంస్థల ఏర్పాటులోనూ ఆయన కృషి ఉంది. ఈ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ డిఆర్‌డిఓ కు కలాం పేరు పెట్టాలని ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖ రాయడం విశేషం. 


ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి నివాళి నిర్ణయంతీసుకున్న సంగతి తెలిసిందే. ఒంగోలు లో ఏర్పాటు చేయబోతున్న సంస్థకు కలాం పేరు పెట్టాలని ఏపీ కేబినెట్‌ రెండు రోజుల కిందటే తీర్మానం చేసింది. కేసీఆర్‌ మాత్రం.. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థకే ఆయన పేరు పెట్టించడం గురించి సిఫారసు చేశారు. 


కేంద్రం తీసుకునే నిర్ణయం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా.. హైదరాబాదుతో కలాంకు ఉన్న అనుబంధానికి గుర్తుగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. కేసీఆర్‌ విమానయాన యూనివర్సిటీ లాంటివి ప్లాన్‌ చేస్తున్నారు. పైగా కలాంకు విమానాలు నడపడం కూడా పెద్ద ప్రీతిపాత్రమైన విషయం. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్లాన్‌ చేసే కొత్త సాంకేతిక సంస్థలు కార్యరూపం దాలిస్తే గనుక.. కలాం పేరుపెట్టడం, అందుకు కేసీఆర్‌ కట్టుబడి ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: