రాజకీయ నాయకులన్నాక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కామన్. వాటి తిప్పిగొడుతూ.. మరి కొన్ని అదనపు ఆరోపణలు చేయడమూ కామనే. ఊరకే నోరుపారేసుకుంటారని జనం ఈసడించుకుంటారు కానీ.. ఈ తిట్టుకోవడం కూడా ఓ ఆర్టే. కాకపోతే.. ఆర్టిస్టిక్ గా తిట్టుకునేంత క్రియేటివిటీ మన రాజకీయ నాయకులకు కాస్త తక్కువే. అలా ఆర్టిస్టిక్ గా తిట్టాలంటే..దానికి కాస్త టాలెంట్ తో పాటు సెన్సాఫ్ హ్యూమర్, సమయస్ఫూర్తి కావాలి. 

తెలంగాణ తెలుగు దేశం నాయకుల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి అంటే ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన నాయకుల్లాగా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి.. దంచుడు.. సచ్చుడు.. లంగ.. లఫంగి.. చీరేస్తా టైపు మాస్ డైలాగులు ఈయన నోట వినిపించవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయనో క్లాస్ లీడర్. అంతే కాదు.. అలాంటి డీసెంట్ ప్రవర్తనతోనే సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 

తెలంగాణ సర్కారు ఇటీవల తీసుకున్న ఉస్మానియా తరలింపు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేసీఆర్ ముందుచూపు లేకుండా లేచిందే లేడికి పరుగన్నట్టు వ్యవహరించి రోగులను ఇబ్బంది పెడుతున్నారని రావుల చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. అకస్మాత్తుగా రోగులను వేరే ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారని.. కొందరిని తరలించారని.. కొందరు రోగులు వ్యతిరేకించేసరికి మళ్లీ ఆ తరలింపు ఆపేశారని.. వివరించారు. 

ఒక ఆలోచన, పద్దతీ పాడు లేకుండా.. రోగుల పట్ల కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులు తలో రీతిగా వ్యవహరిస్తున్నారని రావుల మండిపడ్డారు. కేసీఆర్ నయా రాజరికం వెలగడబెడుతున్నారని..ఇలాంటి పాలన కోసమా తెలంగాణ తెచ్చుకుందని బాధ కలుగుతోందని ఆయన మండిపడ్డారు. అదేదో సినిమాలో రాజు ప్రజలను హింసించినట్టు ఈ కేసీఆర్ హింసించే రాజు 32వ పులకేసిగా తయారయ్యారని మండిపడ్డారు. చూశారా.. సినిమా పేరు ఉపయోగించిన తాను చెప్పాల్సిందంతా ఒక్క ముక్కలో ఎలా చెప్పేశారో మన రావుల గారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: