కోర్టుల్లో తమ నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగలడం, తమ వాదన తేలిపోవడం తెలంగాణ ప్రభుత్వానికి కొత్త కాదు. సాధారణంగా ఉభయ రాష్ట్రాల్తో నిమిత్తం ఉన్న వ్యవహారాల్లో.. ఇదివరకు తీసుకున్న అలాంటి నిర్ణయాలు చాలా వరకు బెడిసి కొట్టాయి. తాజాగా ఫోను ట్యాపింగ్‌ విషయంలో కూడా మరోసారి హైకోర్టు సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం వాదన తప్పుల తడక అని తేలిపోయింది. 


ఫోను ట్యాపింగ్‌ వివాదం ఏపీ సిట్‌ ఏర్పాటుచేసిన తర్వాత తారస్థాయికి చేరుకుంది. దానికి అదనంగా విజయవాడ కోర్టులో విచారణ మొదలయ్యాక.. సెల్‌ ఆపరేటర్లు తమకు తెలిసిందంతా.. ఉన్నదున్నట్లుగా బయటకు కక్కేసరికి తెలంగాణ ప్రభుత్వానికి ఉలికిపాటు వచ్చింది. సెల్‌ కంపెనీలు కాల్‌డేటా తెచ్చివ్వాలని విజయవాడ కోర్టు అడిగేసరికి.. తెలంగాణ ప్రభుత్వం ముందుగా జాగ్రత్త పడుతూ హైకోర్టులో కేసు వేసింది. 


ఇంతకూ అందులో ఏం వాదించారంటే.. తమ రాష్ట్ర అధికారాల మేరకు కాల్‌ డేటా తీసుకున్నాం అని.. టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5(2) ప్రకారం.. ప్రభుత్వానికి ఇచ్చిన కాల్‌డేటాలను సెల్‌ కంపెనీలు తమ వద్ద నిల్వ ఉంచుకోవడానికే వీల్లేదని.. మరి అలాంటప్పుడు.. మళ్లీ తమకు అదే డేటా కావాలని విజయవాడ కోర్టు ఎలా అడుగుతుంది అంటూ ఆ పిటిషన్‌లో వాదించారు. 


అయితే హైకోర్టు ముందు ఆ వాదన నిలబడలేదు. అబద్ధం అని తేలిపోయింది. కాల్‌డేటా ఇవ్వాల్సిందిగా హైకోర్టు పురమాయించేసరికి, సెల్‌ కంపెనీలన్నీ ఉరుకుల పరుగుల మీద కాల్‌డేటా ను కోర్టుకు ఇచ్చేశాయి. ఒకేరోజు వ్యవధిలో నాలుగు కంపెనీలు ఇచ్చాయి. అంటే ఏదైతే.. 'కంపెనీలు తమ వద్ద ఉంచుకోవడం చట్టానికి విరుద్ధం' అని తెలంగాణ సర్కారు పిటిషన్లో పేర్కొన్నదో.. ఆ వివరాలన్నీ వచ్చేశాయి. దాంతో తె- సర్కారు మాటలు మళ్లీ తప్పులే అని తేలిపోయింది. పేరుకు రాంజెఠ్మలానీ లాంటి ఉద్ధండ లాయర్లను తీసుకువచ్చి వాదించేలా చేసుకున్నారు గానీ.. తెలంగాణ సర్కారు అనుకున్న ఫలితాల్ని మాత్రం పొందలేకపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: