ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదానికీ.. చేసేదానికీ చాలా తేడా కనిపిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. లోటు బడ్డెట్ అంటారు.. నిధులు సమస్య ఉందంటారు.. విభజన తర్వాత ఆదాయానికి ఘనంగా గండి పడిందంటారు. కానీ పాలనావ్యవహారాల్లో కానీ.. పథకాల ప్రకటనలో కానీ.. ఎక్కడా లోటు మాత్రం కనిపించడం లేదు. దాదాపు 2 వేల కోట్ల రూపాయలు పెట్టి ఇటీవలే ఘనంగా పుష్కరాలు నిర్వహించారు. ముగింపు వేడుకలైతే.. నభూతో.. న భవిష్యత్ అన్నరీతిలో అదరగొట్టారు. 

ఇక విదేశీ పర్యటనల సంగతి కూడా తెలిసిందే.. ముఖ్యమంత్రి సహా అధికారులు, మంత్రులు జంబో బ్యాచులు విదేశాలకు టూర్లు కొడుతున్నాయి. అధికారులు, మంత్రులు విజయవాడ- హైదరాబాద్ మధ్య విమానాల్లో చక్కర్లు కొడుతూ పాలనావ్యవహారాలు సాగిస్తున్నారు. ఇప్పటివరకూ బాగానే ఉంది కానీ... ముందు ముందు అంత సానుకూల పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. తాజా ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఆదాయ వసూళ్లు ఈ సంగతి స్పష్టం చేస్తున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ వ‌సూళ్లు వృద్ది ఉన్నా.. తొలిత త్రైమాసికంలో టార్గెట్ గా పెట్టుకున్న దాని కంటే... దాదాపు 730 కోట్లు త‌క్కువ‌ ఆదాయం వచ్చింది. గ‌త ఏడాది కంటే రాబ‌డులు పెరిగినా... తెలంగాణ‌తో కంపేర్ చేసుకుంటే ఇంకా త‌క్కువ గానే న‌మోదైంది. వాణిజ్య ప‌న్నుల్లో త‌గ్గుద‌ల, బియ్యం పై  కేంద్రం వ్యాట్ స‌వ‌ర‌ణ వ‌ల్ల ఆదాయం త‌గ్గింద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. 

తొలి త్రైమాసికంలో  10,530 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ 9800 కోట్లు మాత్రమే వ‌సూలయ్యాయి. తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్రా ఆదాయం ఇంకా రెండు వేల కోట్లు త‌గ్గుద‌ల ఉంద‌ట. మొత్తం మీద ఏపీకు 3000 కోట్ల ఆర్దిక లోటు ఉంద‌ని అధికారులు అంచనా వేశారు. రెవెన్యూ వ‌సూళ్ల పై ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నిర్వహించిన ఉన్నత స్థాయి స‌మీక్షలో ఈ లెక్కలు బయటికొచ్చాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: