ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేసే విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఫిక్సయిపోయిందా లేదా? ఒకసారి ఫిక్సయితే.. ఇక కేసీఆర్‌ అలా ముందుకు దూసుకెళ్లిపోవడం గ్యారంటీనే! అయితే ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై అన్ని వర్గాలనుంచి వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడుతున్నట్లుగా కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. కావలిస్తే కొత్త భవనం నిర్మించండి.. కేసీఆర్‌ కలగన్నట్లుగానే జంట ఆకాశహర్మ్యాలను నిర్మించి.. అందులో అధునాతనమైన ఆస్పత్రిని ఏర్పాటు చేయండి.. కానీ ఈ వారసత్వ భవనాన్ని మాత్రం కూల్చడానికి వీల్లేదు... అంటూ సాగుతున్న ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గవలసి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. 


కొన్నిరోజుల కిందట ఉస్మానియా ఆస్పత్రిని స్వయగా పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తక్షణం వారంరోజుల్లోగా ఆస్పత్రిని అక్కడినుంచి తరలించేయాలని... ఆ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేయాల్సిందేనని కూడా ప్రకటించారు. హైదరాబాదులోని వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీకి ఆయన ఛైర్మన్‌గా నియమితులైన రోజుల వ్యవధిలోనే ఈ భవంతిని కూల్చివేయాలనే నిర్ణయానికి ఆయన రావడం బహుశా యాదృచ్చికమే కావొచ్చు. ఏదేమైనప్పటికీ.. ఉస్మానియా భవనం కూల్చేయాలని మాత్రం నిర్ణయించారు. 


అప్పటినుంచి అన్ని వర్గాల్లో ఈ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థానికులు, ముస్లిం వర్గాల వారు సహజంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగానే ఉందది. అదే సమయంలో వారసత్వ సంపద పరిరక్షణకు పోరాడే సంస్కృతీ ప్రియులు, నగర పౌరులు, ఆర్కిటెక్ట్‌ లు అందరూ దీనికోసం ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశం లు కూడా ఉస్మానియాను కూల్చివేయడాన్ని వ్యతిరేకించాయి. వీరి మాటలు రాజకీయ విమర్శలు అని కొట్టిపారేసే అవకాశంఉన్నప్పటికీ .. సంబంధిత కన్జర్వేషన్‌ రంగ నిపుణులు కూడా ఉస్మానియా భవనాన్ని శాస్త్రీయంగా పరిశీలించి.. ఇంకా కొన్ని దశాబ్దాల పాటూ ఇది ఖచ్చితంగా క్షేమంగా నిలిచి ఉంటుందని నివేదికలు ఇవ్వడం.. విశేషం. 


పైగా కేసీఆర్‌ జంట ఆకాశహర్మ్యాలను నిర్మించి.. ఉస్మానియా ఆస్పత్రిని ఓ అద్భుతంగా కేసీఆర్‌ మార్చేయదలచుకుంటే గనుక.. అందుకు ఆస్పత్రి ఆవరణలోనే 8 ఎకరాల ఖాళీజాగా ఉన్నది కదా.. ఇంకా నిశ్చింతగా ఉన్న ఈ వారసత్వ భవనాన్ని కూల్చేయడం ఎందుకు? అనే ప్రశ్నను ఎక్కువ మంది సంధిస్తున్నారు. కొత్త భవనం కట్టడాన్ని, ఆస్పత్రిని తరలించడాన్ని ఎవరూ వద్దనడం లేదు. ఈ భవనంలో రోగులకు భద్రత లేదనే ప్రభుత్వ ఏకైక వాదనకు అభ్యంతరాలు లేవు. అలాంటప్పుడు భవనాన్ని ఏకపక్షంగాకూల్చేస్తే చెడ్డపేరు తప్పదని కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్లుగా కనిపిస్తోంది. 


తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట మార్చారు. కూల్చివేతపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కదా అని ఆయన అంటున్నారు. ముందు భవనంలోని ఆస్పత్రిని పూర్తిగా తరలించిన తర్వాత.. కూల్చివేత గురించి అప్పుడు ఆలోచిస్తాం అని అంటున్నారు. అంటే ప్రభుత్వం ఈ విషయంలో కొద్దిగా మెత్తబడినట్లే కనిపిస్తోంది. ముందుముందు ఈ వివాదం ఇంకాస్త ముదిరితే ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: