ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పుడు మరో వివాదం రాజుకుంటోంది. పరిష్కారం కోసం మళ్లీ గవర్నర్ నరసింహన్ వద్దకు క్యూ కడుతున్నారు నాయకులు. రాష్ట్ర విభజన పదో షెడ్యూల్ లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిందీ వివాదం. హైదరాబాద్ లోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఆ విశ్వవిద్యాలయాలు కోరడమే ఈ పరిస్థితికి అసలు కారణం. ఒప్పందాలు లేకుంటే ఏపీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి లేదని తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీలు తేల్చి చెప్పాయి. 

ఈ వివాదాల్లో మొదటిది తెలుగు విశ్వవిద్యాలయం గొడవ. ఇందులో ఏపీ విద్యార్థులు చేరాలంటే ఏపీ ప్రభుత్వం తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నది యూనివర్సిటీ అధికారుల మాట. అబ్బే.. ఉమ్మడి షెడ్యూలులో ఉన్నందువల్ల పదేళ్ల వరకూ ప్రత్యేక ఒప్పందం ఏదీ అవసరం లేదంటోందీ ఏపీ సర్కారు.  రెండోది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సంబంధించింది. ఇక్కడా సేమ్ సీన్. 

మూడోది జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏపీలో మూడు కళాశాలలున్నాయి. ఈ కళాశాలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేమని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం కోర్టులకూ ఎక్కింది. రాష్ట్ర పునర్విభజన తర్వాత కేవలం ఒక ఏడాది మాత్రమే తాము సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదేశాలిచ్చిందని ఆ తర్వాత తమ సేవలు కావాలంటే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయా విశ్వవిద్యాలయలు కోర్టుకు తెలిపాయి. 

ఫైనల్ గా ఈ వివాదంపై ఏపీ మంత్రి గంటా గవర్నర్ నరసింహన్ ను కలిశారు. తమకు ఏవిధంగా అన్యాయం జరుగుతోందో వివరించారు. సుమారు గంటన్నర పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఎప్పటిలాగానే న్యాయం చేస్తానంటూ గవర్నర్ రొటీన్ డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించారు.  మరి నరసింహన్ ఈ ఇష్యూపై కేసీఆర్ తో ఏమన్నారో.. ఆయన ఏం సమాధానం చెప్పారో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: