అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలొచ్చేది ఐదేళ్లకోసారే.. ఈ లోపు ఎన్నికలు రావాలంటే.. ప్రభుత్వం కప్పుకూలిపోవాల్సి ఉంటుంది. లేదా.. ముఖ్యమంత్రి ఏదైనా కారణంతో రాజీనామా అయినా చేయాలి. ప్రస్తుతం వీటిలో ఏ సీన్ కూడా ఆంధ్రాలో కనిపించడం లేదు. 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీకి వందకు పైగా కట్టబెట్టేసి సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్సిచ్చారు ఓటర్లు. 

ఏపీలో సీన్ ఇలా ఉంటేై ఓ ప్రతిపక్ష పార్టీ పెద్ద మనిషి అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఆయనే అంబటి రాంబాబు..ఐతే అందుకు మూలకారణం సీఎం చంద్రబాబు చేయించిన టీడీపీ అంతర్గత సర్వేయే కావడం విశేషం. ఈ సర్వేలో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు అద్భుతంగా ఉందంటూ రిపోర్టులు వచ్చాయి. అలాగే వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు మరీ నాసిరకంగా ఉందని తేలిందట. ఔను మరి టీడీపీ చేయించిన సర్వే అలాకాకుండా ఎలా ఉంటుంది. అందులో ఆశ్చర్యం ఏముంది..

మరీ దారుణమైన విషయం ఏంటంటే.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ర్యాంకు 175 మంది ఎమ్మెల్యేల్లో కనీసం వంద లోపు లేకపోవడం విశేషం. జగన్ పనితీరు ఆధారంగా ఆయనకు 135 ర్యాంకు కేటాయించారు. ఏ 20, 30 ర్యాంకు ఇచ్చుంటే గొడవ ఉండేది కాదు.. మరీ 135 ఇచ్చేసరికి వైసీపీ నేతలకు ఎక్కడో కాలింది. అందుకే ఈ సర్వేపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.   

చంద్రబాబు తన పాలనపై  చేసిన సర్వేలన్నీ బూటకాలని  వైసీపీ మౌత్ పీస్ అంబటి రాంబాబు ఆవేశపడిపోయారు. ప్రభుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టే ఇలాంటి బూటకపు సర్వేలతో జనం దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తమ పాలన అంత బాగా ఉందని నిజంగా అనుకుంటే.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. పాయింట్ బాగానే ఉంది కానీ.. ప్రతిపక్షం కోరుకున్నప్పుడల్లా ఎన్నికలు నిర్వహించడం కుదురుతుందా.. కుదరదన్న సంగతి అంబటికీ తెలుసు.. కానీ విషయాన్ని గట్టిగా చెప్పడం కోసం ఆయన అలాంటి సవాల్ విసిరి ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: