తెలంగాణ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పై ఆ మధ్య ఔట్ లుక్ పత్రిక ఓ అభ్యంతరకరమైన కార్టూన్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో చాలా దుమారమే రేగింది. ఔట్ లుక్ పత్రిక తీరును మేథావులు, ప్రముఖులు, సామాన్యులు అంతా తప్పుబట్టారు. చివరకు ఔట్ లుక్ పత్రిక కూడా తన కథనంపై క్షమాపణలు తెలిపింది. ఆ కథనాన్ని ఉపసంహరించుకుంది.

ఐతే.. ఔట్ లుక్ పై స్మితా సబర్వాల్ భర్త, ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ అప్పుడే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ విచారణ ఊపందుకుంది. మంగళవారం తమ ఎదుట హాజరైన ఔట్‌ లుక్‌ మ్యాగజైన్‌ ప్రతినిధులపై సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు విచారణ నిర్వహించి...అయిదుగురి నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఔట్‌ లుక్‌  హైదరాబాద్‌ రెసిడెంట్‌ సహాయ ఎడిటర్‌ మాధవి టాటాతోపాటు మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ కృష్ణప్రసాద్‌, కార్టూనిస్టు సాహిల్‌ భాటియా, ఔట్‌ లుక్‌ ప్రెసిడెంట్‌ ఇంద్రా నిల్‌ రాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ విశ్వదీప్‌ మంగళవారం సీసీఎస్‌ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో సీసీఎస్‌కు వచ్చిన అయిదుగురు ప్రతినిధులు.. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చారు. హైదరాబాద్‌ రెసిడెంట్‌ సహాయ ఎడిటర్‌ మాధవిటాటాపైనే పోలీసులు ఎక్కువగా ప్రశ్నలను సంధించారు. ఐతే.. ఔట్ లుక్ ప్రతినిధులు మాత్రం అది సరదా కాలమ్ అని.. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని ఆ కథనం రాయలేదని వివరణ ఇచ్చారట. తమకు పెద్ద ఎత్తు ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్‌ రావడంతో తాము వెంటనే రిజాయిండర్‌ ప్రచురించామని చెప్పారట. 

మరోవైపు.. హైదరాబాద్ పోలీసుల తీరుపై ఎడిటర్స్ గిల్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం.. మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమర్థనీయంగా లేదని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. ఔట్ పత్రిక క్షమాపణ చెప్పి.. రిజాయిండర్ ప్రచురించిన తర్వాత కూడా వేధించడం సరికాదని కామెంట్ చేసింది. ఔట్ లుక్ హైదరాబాద్‌ రెసిడెంట్ సహాయ ఎడిటర్‌ మాధవి టాటా భద్రత గురించి గవర్నర్‌ నరసింహన్‌కు రెండు లేఖలు రాసినట్లు ఔట్ లుక్ ఎడిటర్‌ కృష్ణప్రసాద్‌ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: