ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ శాంతి మంత్రం తో ప్రపంచ దేశాలతో శభాష్ అనిపించుకుంటున్నారు. బంగ్లాదేశ్, కిజ‌కిస్థాన్ వంటి ప‌లు దేశాల‌తో శాంతి ఒప్పందాలు చేసుకుని త‌నదైన శైలీ లో ముందుకు పోతున్నారు. తాజా నాగా శాంతి ఒప్పందంతో మ‌రో మైలు రాయిని దాటారు.  నాగాలాండ్‌లో శాంతి నెలకొంటున్నదంటే సంతోషించనిదెవరు? ఈశాన్యంలో ఎర్రబడిన ఆ నేలపై శాంతికపోతం ఎగురుతుందంటే ఎంతో మనశ్శాంతి. వివరాలు బయటకు పొక్కక పోయినా, సోమవారం ప్రధాని నివాసంలో నాగా తిరుగుబాటు నాయకులకూ, ప్రభుత్వ ప్రతినిధులకూ మధ్య కుదిరిన అవగాహన అనేక ఆశలు రేకెత్తిస్తున్నది. దేశ స్వాతంత్య్రంతో పాటుగానే, నాగాల ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఊపిరిపోసుకున్న ఒక వేర్పాటువాద ఉద్యమం ఈ ఆరుదశాబ్దాల కాలంలో ఎన్ని మలుపులు తీసుకున్నదో కళ్ళారా చూసిన మనం, ఇప్పుడు ఈ ఒప్పందం శాంతిని శాశ్వతంగా ప్రతిష్ఠించగలదో లేదో చూడాలి.

తూర్పు దేశాలతో వాణిజ్య బంధాన్ని ఏర్పరచుకుంటున్నది


ప్రపంచీకరణలో భాగంగా భారత్ తూర్పు దేశాలతో వాణిజ్య బంధాన్ని ఏర్పరచుకుంటున్నది. ఇందులో భాగంగా భారత్ నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్ వరకు భారీ రహదారి నిర్మించాలంటే ఈశాన్య రాష్ర్టాలలో శాంతియుత ప‌రిస్థితులు నెల‌కొల్ప‌వ‌ల‌సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో నాగాల‌తో శాంతి ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది. తాజా ఒప్పందం లో పూర్తి వివ‌రాలు ఉండ‌వ‌ని, స్థూల అవ‌గాహ‌న మాత్ర‌మే ఉంటుంద‌ని చెబుతున్నారు. అంటే ఈ ఒప్పందంలోని ప‌ద‌జాలాన్ని ఇరు ప‌క్షాల‌కు ఆమోగ‌యోగ్యమైన రీతిలో క‌ట్టె విరుగ‌కుండా పాము చావ‌కుండా అన్న‌ట్టు దౌత్య చ‌తుర‌త తో రూపొందించి ఉంటారు. ఇటువంటి ఒప్పంద పాఠాన్ని ఇరుప‌క్షాలు త‌మ‌కు అనుగుణంగా నిర్వ‌చించుకుంటాయి. నాగా తిరుగుబాటు నాయ‌కుల‌తో ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో హింసాయుత ఘ‌ట్టం ముగిసి శాంతి నెల‌కొంటుంద‌నే ఆశాభావం వ్య‌క్త‌మవుతున్న‌ది. నాగా తిరుగుబాటు వ‌ర్గాల‌లో ప్ర‌ధాన‌మైన‌దీ, ఎక్కువ‌గా ప్ర‌జామోదం గ‌ల‌దైన నేష‌న‌లిస్ట్ సోష‌లిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఐజాక్-ముయివా(ఎన్ఎస్సీఎన్-ఐఎం) వ‌ర్గంతో ఈ ఒప్పందం కుదిరింది. మ‌రో రెండు సాయుధ గ్రూపులు కేంద్రంతో వ‌చ్చే ఏడాది వ‌ర‌కు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 


ఇక మిగిలిందల్లా మయన్మార్‌కు చెందిన ఖాప్లాంగ్ నాయకత్వంలోని నాగా దళం. ఖాప్లాంగ్ వర్గం ఈ ఏడాది ఆరంభంలో కాల్పుల విరమణ ను ఉల్లంఘించి భారత సైన్యంపై దాడి చేసింది. ఈ వర్గం భాగస్వామి కానంత మాత్రాన తాజా ఒప్పందం ప్రాధాన్యాన్ని తగ్గించి చూడకూడదు. ఈ ఒప్పందం సమస్యకు ముగింపు మాత్రమే కాదు, నూతన భవిష్యత్తుకు నాంది అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటికీ, ఆ ఒప్పంద సారాంశమేమిటనేది ఉత్కంఠభరితంగా ఉన్నది. హోం మంత్రిత్వ శాఖతో సంబం ధం లేకుండా ప్రధాని కార్యాలయం తమ దూత ద్వారా ఈ సంప్రదింపుల ప్రక్రియను సాగించింది. ఈ ఒప్పందానికి ముందు- విస్తృత ఆమోదం పొందడానికి- ప్రధాని మోదీ వివిధ రాజకీయ పక్షాల నేతలను సంప్రదించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు ఒప్పంద సారాన్ని అధికారికంగా వెల్లడించే సూచనలు కనిపించ డం లేదు. ఈ ఒప్పందం ద్వారా నాగాలాండ్‌కు స్వయం ప్రతిపత్తి వంటిది ఇచ్చారా ఇస్తే ఎంత మేర అనేది ఆసక్తి గొలుపుతున్నది. తమ భూభాగానికి సంబంధించి ఏదైన అభ్యంతరకర అంశం ఒప్పందంలో ఉందా అనే విషయమై ఇరుగు పొరుగు రాష్ర్టాలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నాగా పోరాటం దాదాపు ఆరు ద‌శాబ్దాలుగా 


నాగా పోరాటం దాదాపు ఆరు ద‌శాబ్దాలుగా సాగుతున్న‌ది. నాగా ప్ర‌జ‌లు సొంత అస్తిత్వం గ‌ల వారు క‌నుక నాగాలాండ్ ప్ర‌త్యేక దేశంగా ఉండాల‌నేది వీరి వాద‌న‌. ఆసియా చ‌రిత్ర‌లోనే అత్యంత సుదీర్ఘ సాయుధ పోరాటంగా దీనిని చెబుతారు. ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు ప్యారిస్ లో ఈ పోరాట నాయ‌కుల‌తో చర్చ‌లు జ‌రిపారు. ఆ త‌రువాత ప‌లు ద‌ఫాలు విదేశాల‌లో చ‌ర్చ‌లు జ‌రిగాయి. 1997 లో కాల్పులు విర‌మ‌ణ ఒప్పందం అత్యంత కీలక ఘ‌ట్టం. ఈ కాల్పుల విర‌మ‌ణ ప్రారంభ‌మైన నాటి నుంచి కేంద్ర ప్ర‌భుత్వం చాక‌చక్యంతో వ్య‌వ‌హ‌రిస్తూ..దాదాపు ఎన‌భై ప‌ర్యాయాలు చ‌ర్చ‌లు సాగించింది. సాయుధ పోరాట నాయకులు వృద్ధులు కావ‌డం, నాగా స‌మాజంలో విభేదాలు, సాయుధ ద‌ళాలు వ‌సూళ్ళ‌కు పాల్ప‌డి ప్ర‌జాభిమానం కోల్పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఎన్ఎస్సీఎన్- ఐఎం వ‌ర్గం చ‌ర్చ‌ల‌కు దిగి వ‌చ్చింది. సుదీర్ఘ పోరాటం లో నాగా వ‌ర్గాల‌తో అనేక ఒప్పందాలు కుదిరాయి. 

పొరుగున గల అస్సాం



ఈ క్రమంలో నాగాలు భారత దేశంలో భాగం కావడానికి, దేశ రాజ్యాంగాన్ని గుర్తించడానికి అంగీకరింపచేయడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది. పొరుగున గల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాలను నాగాలాండ్‌లో కలుపాలనేది తిరుగుబాటుదారుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. పొరుగు రాష్ర్టాలు ఎట్లాగూ ఇందుకు అంగీకరించవు. మణిపూర్‌లోని నాలుగు జిల్లాలను విడదీస్తే ఆ రాష్ట్రం సగానికి పైగా భూభాగాన్ని కోల్పోతుంది. నాగాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని మణిపూర్‌లోని భూభాగానికి కూడా వర్తింపచేస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు, 2001లో మణిపూర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆగ్రహంతో తమ అసెంబ్లీ భవానాన్ని కూడా తగుల బెట్టారు. దీంతో కేంద్రం ఈ ప్రతిపాదనను విరమించుకోవలసి వచ్చింది. తాజా ఒప్పందంలో పొరుగు ప్రాంతాలను విలీనం చేసే అంశం లేదని తెలుస్తున్నది. అయితే నాగాల ప్రత్యేక గుర్తింపు అంశం ఏమిటన్నది తెలువదు.


ఈ నేపథ్యంలో, భౌగోళికంగా వారిని కలపలేకపోయినా, నాగాలు నివసిస్తున్న ఆయా ప్రాంతాలకు ఇప్పటికంటే ఎక్కువ స్వతంత్రతను ఇచ్చి, సాంస్కృతికంగా వారిని నాగాలాండ్‌తో అనుసంధానించే ప్రతిపాదన ఒకటి ముందుకు తెచ్చినట్టు తెలుస్తున్నది. ఈ ఒప్పందం ఆచరణసాధ్యం కావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం కనుక, అందుకు ప్రతిపక్షాలతోనూ, ప్రాంతీయపార్టీల అధినాయకులతోనూ ప్రధానమంత్రి ముందుగానే మాట్లాడటం ఉపకరిస్తుంది. భారత్‌ ఆర్థికవ్యవస్థ బలపడాలంటే ఈశాన్యం బలంగా ఉండాలని విశ్వసిస్తున్న నరేంద్రమోదీ అక్కడ శాంతికోసం బలమైన ప్రయత్నం చేసినందుకు అభినందించాలి అయితే దేశ స్వాతంత్ర్యం తో పాటుడానే, నాగాల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఊపిరిపోసుకున్న ఒక వేర్పాటువాద ఉద్య‌మం ఈ ఆరుద‌శాబ్దాల కాలంలో ఎన్ని మలుపులు తీసుకున్న‌దో క‌ళ్ళారా చూసిన మ‌నం, ఇప్పుడు ఈ ఒప్పందం శాంతి శాశ్వ‌తంగా ప్ర‌తిష్టించ‌గ‌ల‌దో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: