కొందరికి పసివయసులోనే మనసు మీద ముద్రపడిపోయే కొన్ని కోరికలు ఉంటాయి. ఎప్పటికైనా సరే.. ఆ కోరికలను నెరవేర్చుకోవడం అనేది పెండింగ్‌ జాబితాలో మిగిలిపోతుంటుంది. వయసు మీదపడిపోయినా సరే.. నిజానికి వయసు సహకరించని.. సమయంలో కూడా అవకాశం వస్తే చాలు.. ఆ కోరికలను తీర్చేసుకోవాలని ఉత్సాహపడతారు. భారతీయ పారిశ్రామిక రంగంలో ఎంత ప్రముఖుడు అయినప్పటికీ.. ఇలా ముచ్చట తీర్చుకోవడానికి తాను అతీతుణ్ని కాదని రతన్‌ టాటా నిరూపించుకున్నారు. ఆయన సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన సందర్భంగా పైలట్‌గా కూడా అవతారం ఎత్తారు. 


రతన్‌ టాటా పారిశ్రామిక వేత్తగా ఎక్కువ ప్రపంచానికి తెలిసినప్పటికీ ఆయన పైలట్‌ కూడా! విమానం నడపడం అనేది ఆయనకు ఎంతో ఇష్టం కూడా. సోమవారం నాడు ఆయన స్వయంగా విమానం నడుపుకుంటూ ఏపీకి వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఒకరోజు పూర్తిగా సమావేశాల్లో పాల్గొన్న రతన్‌ టాటా కృష్ణా జిల్లాల్లో 264 గ్రామాలను తమ టాటా ట్రస్టు తరఫున దత్తత కూడా తీసుకున్నారు. ఈ మేరకు గ్రామ ఆకర్ష పథకం కింద గ్రామాలను దత్తత తీసుకోవడానికి సంబంధించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ కుదుర్చుకోవడానికి టాటా ట్రస్టు ఛైర్మన్‌గా రతన్‌ టాటా సోమవారం విజయవాడకు వచ్చారు. అక్కడ క్యాంపు ఆఫీసులో రోజంతా చంద్రబాబునాయుడుతో సమావేశం అయ్యారు. మధ్యాహ్న భోజనం కూడా కలిసి చేశారు. 


ముంబాయి నుంచి తమ సొంత టాటా సంస్థకు చెందిన 13 సీట్ల ప్రత్యేక విమానాన్ని సొంతంగా నడుపుకుంటూ వచ్చిన రతన్‌ టాటా.. తిరిగి వెళ్లేప్పుడు కూడా ఇక్కడినుంచి ఢిల్లీకి తనే విమానం నడుపుకుంటూ వెళ్లారు. నిజానికి అబ్దుల్‌కలాం కు కూడా విమానం నడపడం అనేది చిన్ననాటికల. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత.. యుద్ధ విమానాల్ని కూడా నడిపి తన కల నెరవేర్చుకున్నారు. అలాగే రతన్‌ టాటా కూడా.. టాటా అంతటి వ్యాపార సామ్రాజ్యానికి ఛైర్మన్‌గా రిటైరై... ట్రస్టుకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ వయసులోనూ స్వయంగా విమానాన్ని నడుపుకుంటూ రావడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: