జగన్ ఈ మధ్య మళ్లీ ముఖ్యమంత్రి కలలు కనడం మొదలుపెట్టారు. అవసరం అయిన చోట.. కాని చోట కూడా తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొస్తున్నారు. అనేక రకాల బాధితుల దగ్గరకు వెళ్లినప్పుడు సాంత్వన వచనాలు పలికే సమయంలో.. తాను ముఖ్యమంత్రి అయ్యాక మీకు న్యాయం చేస్తా అని హామీ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండదని జోస్యం చెబుతున్నారు. 

రాజధాని ప్రాంతంలో పర్యటించిన జగన్.. తాను ముఖ్యమంత్రి అయితే భూసేకరణ ద్వారా సేకరించిన భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాడట. అలా ఇలా కాదు. పువ్వుల్లో పెట్టి మరీ అప్పగిస్తా అని ఢంకాభజాయించి చెబుతున్నారు జగన్. మరి జగన్ మాటలు నిజమే అయితే.. పరిస్థితి ఏంటి.. ప్రత్యేకించి రాజధాని విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఆలోచిస్తే అంతా గందరగోళం అనిపించడం ఖాయం. 

ఎందుకంటే.. చంద్రబాబు సర్కారు అతి కీలకమైన రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. ఆయన ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల మాటలను పరిగణనలోకి తీసుకోలేదు.అంతదాకా ఎందుకు తమ పార్టీలోనే కొందరు కీలక వ్యక్తుల మాటలనూ ఆయన లెక్కచేయలేదు. తన ప్రణాళిక తనకుందంటూ ముందుకెళ్లారు. మూడు పంటలు పండే భూముల్లో రాజధాని వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పిన మాటలనూ లెక్క చేయలేదు. 

చంద్రబాబు తనకు మిగిలిన ఈ మూడున్నరేళ్ల సమయంలో రాజధాని నిర్మాణాన్ని ఓ కొలిక్కి తీసుకురాగలరా.. ఇంతవరకూ భూమిపూజ తప్ప ఏమీ కాని రాజధాని నిర్మాణం ఇంత తక్కువ సమయంలో పూర్తవుతుందా.. ఒకవేళ పూర్తికాకపోతే.. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే.. రాజధాని నిర్మాణం కుంటుపడుతుందా.. జగన్ పైకి చెప్పకపోయినా తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నారు. దొనకొండ, వినుకొండ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలన్నది ఆయన అభిప్రాయమని చెబుతారు. 

జగన్ అధికారంలోకి వస్తే.. రాజధాని ప్రాంతాన్ని మారుస్తారా.. లేక భూసేకరణకు వెళ్లకుండా చిన్నరాజధానితో సరిపెట్టుకుంటారా.. అన్నది ఆలోచించాలి. ఐతే..అసలు జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అంటున్న అధికారపార్టీ నాయకులు.. అందరినీ కలుపుకు వెళ్తేనే..ఎవరు అధికారంలో ఉన్నా.. రాజధాని మాత్రం సక్రమంగా నిర్మాణమవుతుంది. అభివృద్ధి చెందుతుంది. ఆ తెలివిడి రాజకీయ నేతలకు అవసరం. 


మరింత సమాచారం తెలుసుకోండి: