విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో ఏపీకి పెద్ద దిక్కుగా ఉండి.. అనేక హామీలు వచ్చేలా చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల బాగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలుగువాడై యుండీ ఏపీకి ఏ విధంగా సాయపడటం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఐతే.. సాధ్యమైనంతవరకూ తన చేతిలో ఉన్నంతవరకూ ఏపీకి సాయం చేస్తున్నాననే వెంకయ్య చెబుతున్నారు. 

ఆయన తాజాగా ప్రత్యేక హోదా కోసం తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై సానుకూల నిర్ణయం త్వరగా తీసుకోవాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు.  నీతి ఆయోగ్ సీఈవోతో పాటు ఇతర అధికారులతో తన నివాసంలో భేటీ అయిన వెంకయ్య నాయుడు ఏపీ విభజన చట్టం చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల రాయితీలను త్వరగా అందేలా చూడాల్సిన బాధ్యత నీతి ఆయోగ్ పై ఉందని పేర్కొన్నారు. 

వెంకయ్య దాదాపు గంటసేపు నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఆంధ్రా, తెలంగాణ విభజన తీరును ఆయన నీతి ఆయోగ్ సభ్యులకు వివరించినట్టు తెలిసింది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించాలని, పోలవరం ప్రాజెక్టుకు కావాల్సినంత సాయం అందించాలని, కలహండి-కోరాపుట్ ప్రాంతానికి ఇచ్చిన తరహాలో పారిశ్రామిక రాయితీలు కల్పించాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ కు ఇచ్చిన మినహాయింపులను రాష్ట్రానికి సైతం ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు నిధుల కొరత లేకుండా చూడాలని సూచించారు.

నీతి ఆయోగ్ సభ్యులతో వెంకయ్య మీటింగ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం మరణాలు ఒక్కొక్కటిగా పెరుగుతున్న తరుణంలో నీతి ఆయోగ్ సత్వరమే చర్యలు తీసుకోవాలని.. ఏమాత్రం ఆలస్యం చేయవద్దని వెంకయ్య సూచించినట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: