ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. దీని ప్రభావం విద్యావ్యవస్థపైనా పడింది. పుస్తకాల్లో సిలబస్ లు మారాయి. ముఖ్యంగా ఏ రాష్ట్రానికి చెందిన చరిత్రను మాత్రమే ఆ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రత్యేక పాఠాలుగా రూపొందించింది. ఇంటర్ సెకండియర్ హిస్టరీ పుస్తకాన్ని తెలంగాణ చరిత్రకు కేటాయించేశారు.

అటు ఆంధ్రాలోనూ దీని ప్రభావం ఎక్కువే ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 6 నుంచి 10 వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన పాఠాలను తొలగిస్తోంది. లేటెస్టుగా ఉమ్మడి రాష్ట్రంలో ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో తొలగించవలసిన పాఠాలు, పాఠ్యాంశాల జాబితా ఒకటి విడుదల చేసింది. తెలంగాణ కవుల రచనలు, చరిత్ర పాఠాలు, చివరకు భౌగోళిక విషయాలను కూడా తొలగించేశారు. 

పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో అలిశెట్టి ప్రభాకర్ రాసిన నగర గీతం, నరసింహారావు రచించిన నేనెరిగిన బూర్గుల, పాలకుర్తి సోమన రచించిన బసవ కళ్యాణం పాఠాలు తొలగించారు. తొమ్మిదో తరగతిలో వట్టికోట అళ్వార్‌స్వామి రాసిన చిన్నప్పుడే అనే పాఠం ఎత్తేశారు. తెలంగాణ కవులు రాసిన మన సంస్కృతి, బాల్య క్రీడలు అనే పాఠాలు రద్దు చేశారు. ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో ఖనిజాలు, గనుల తవ్వకం అనే పాఠంలో సింగరేణి బొగ్గు గనులు పాఠం తీసివేశారు. 

ఐతే విశాలాంధ్ర కోసం పాటు పడిన బూర్గుల రామకృష్ణారావు పాఠం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కవయిత్రి సరోజినీనాయుడు కవిత్వాన్ని కూడా తొలగించడాన్ని తెలంగాణ వాదులు తప్పుబడుతున్నారు. పాశ్చాత్య దేశాలను సైతం ముగ్ధులను చేసిన సరోజినీ గీతం తెలంగాణది అని భావించడం సరికాదంటున్నారు. వలసపాలిత ప్రాంతాలలో విముక్తి ఉద్యమాలు అనే సార్వజనీన పాఠం కూడా తీసేశారు. ఎనిమిదో తరగతి ఉపవాచకంలో హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తమ రాష్ర్టానికి సంబంధం లేదంటూ పక్కనబెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: