ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయాక మీడియాలోనూ క్రమంగా మార్పు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలు తమ తెలంగాణ ఎడిషన్ల పేర్లు మార్చేశాయి. తెలంగాణ రంగు పులుముకున్నాయి. అటు ఆంధ్రాలోనూ రాజధాని కేంద్రంగా మీడియా పుంజుకుంటోంది. కొత్త పత్రికలు, టీవీలు వస్తున్నాయి.  

ఈ దిశగా తొలి అడుగు మీడియా 24 న్యూస్ పేరుతో పడుతోంది. అమరావతి కేంద్రంగా ఎమ్మెస్ మీడియా హౌస్ ఈ ఛానల్ ని తీసుకొస్తోంది. ఈ మధ్యనే హైదరాబాద్ లో మీడియా 24 న్యూస్ లోగోని సంస్థ ఛైర్మన్ షేక్ ఖాజా మొహియుద్దీన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు పాత్రికేయ ప్రముఖులు పొత్తూరి వెంకటేశ్వర రావు, కొమ్మినేని శ్రీనివాసరావు, తెలకపల్లి రవి, భండారు శ్రీనివాసరావుహాజరయ్యారు. 

ఈ ఛానల్ అమరావతితో పాటు హైదరాబాద్ కేంద్రంగా మరో ఛానల్ ని కూడా త్వరలో ప్రారంభిస్తుందట. కొత్త ఛానల్ మీడియా 24 న్యూస్ కు ఎడిటోరియల్ డైరెక్టర్ గా ప్రముఖ జర్నలిస్ట్ నేమాని భాస్కర్ వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఎన్టీవీ, సాక్షి, ఎక్స్ ప్రెస్ టీవీల్లో చురుగ్గా పని చేశారు. ఈ కొత్త ఛానల్ కూడా ఈటీవీ, సాక్షి, ఆంధ్రజ్యోతి తరహాలోనే కుర్రాళ్లకు సొంత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిచ్చే ఆలోచన చేస్తోంది.  

రాష్ట్రం విడిపోయినా ఇప్పటికీ మెజారిటీ ఛానళ్లు హైదరాబాద్ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో పనిచేసే జర్నలిస్టులు.. తమకు ఇష్టం ఉన్నాలేకున్నా.. హైదరాబాద్ లో ఉండే ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలో ఉంటూ ఆంధ్రా కోసం పని చేయడం ఇబ్బందిగా ఉన్నా.. గత్యంతరం లేక ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి వారి కోసం ఈ కొత్త ఛానల్ ఆశలు కల్పిస్తోంది. కాకపోతే.. ఇప్పటికే కొన్ని ఛానళ్లు జీతాల కోసం ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఈ కొత్త ఛానల్ అలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా దివ్యంగా నడవాలని.. నవ్యాంధ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని ఆశిద్దాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: