రాజధాని నిర్మాణానికి భూసేకరణ ద్వారా ప్రభుత్వం భూములు తీసుకోవాలనే నిర్ణయాన్ని.. నిలుపుదల చేయించిన పవన్‌కళ్యాణ్‌ కి బేతపూడి,పెనుమాక,ఉండవల్లి రైతులు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలోని ప్రెస్‌ క్లబ్‌లో ఆ మూడు గ్రామాల రైతులు  మీడియా సమావేశాన్నిఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ జారీ చేసిన భూసేకరణ ఆర్డినెస్స్‌ కి కాలం చెల్లడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రుల ధోరణిని వారు తీవ్రంగా తప్పు పట్టారు.

రాజధాని నిర్మాణానికి  అవసరమైన భూమికన్నా.. ఎక్కువ భూమిని సమీకరణ చేయడాన్ని ఆ మూడు గ్రామాల రైతులు ఖండించారు. జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన మేలును ఈ మూడు గ్రామాల రైతులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటామన్నారు. పవన్ కల్యాణ్ కేవలం పవర్ స్టార్ మాత్రమే కాదని.. పవర్ పార్ట్ నర్ అంటూ ఓ రైతు నినాదాలు చేశారు. 

ఏపీ మంత్రులు నారాయణ, పుల్లారావు తమను మోసం చేసేందుకు చాలా ప్రయత్నం చేశారని రైతులు విమర్శలు గుప్పించారు. భూసేకరణ కేవలం తన ఒక్కడి నిర్ణయమని.. ఇందులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు తెలియకుండా ఇలాంటి నిర్ణయాన్ని నారాయణ ఒక్కరు ఎలా తీసుకుంటారని రైతులు ప్రశ్నించారు.  

ఇప్పటికైనా ఏపీ సర్కారు తన తీరుమార్చుకోవాలని ఆ మూడు గ్రామాల రైతులు కోరారు. రాజధాని కోసం 5 వేల ఎకరాలు చాలని.. ఈ విషయంలో సర్కారు పవన్ కల్యాణ్, జయప్రకాశ్ నారాయణ్ లను దగ్గర కూర్చోబెట్టుకుని.. వారి మాటలు వినాలను రైతులు విజ్ఞప్తి చేశారు. శ్రీశ్రీశ్రీ శ్రీమాన్ శ్రీ అంటూ పవన్ కల్యాణ్ ను ఈ రైతులు పోస్టర్లలో ఆకాశానికెత్తేశారు.. ఏటా మూడు పంటలు పండే భూములను ఇవ్వడానికి ఎప్పటికీ తాము అంగీకరించేదిలేదంటున్నారు రైతులు.


మరింత సమాచారం తెలుసుకోండి: