అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఐదు రోజులపాటు ఈ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ మధ్య వరుసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై పడకుండా టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. అధికారం చేపట్టి ఏడాది దాటి మూడునెలలు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి చిట్టా సభ ముందు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఐతే.. అసెంబ్లీ సమావేశాల వేళ వైసీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా సాధనలో వైఫల్యంతో పాటు నిధుల జాడ కూడా అంతగా లేకపోవడం, పుష్కరాల్లో అపశ్రుతి, రాజధాని భూముల విషయంలో క్లారిటీలో లేకపోవడం.. ఇలా అన్నీ చిక్కుముళ్లుగానే కనిపిస్తున్నాయి. వీటిన్నింటినీ సభలో ప్రస్తావించి సర్కారును ఇరుకున పెట్టేందుకు జగన్ సేన రెడీ అవుతోంది. 

మరోవైపు ఏపీలో క్రమంగా పరచుకుంటున్న కరవుపైనా జోరుగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సబ్జక్టును ఫోకస్ చేస్తే పెద్దగా ఇబ్బంది లేకుండా బయటపడొచ్చన్న ఆలోచనలో టీడీపీ దళాలు ఉన్నాయి. అతి తక్కువ పరువు నష్టంతో ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి బయటపడాలని ఆ పార్టీ చూస్తోంది. కరవుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఓ ప్రకటన చేసే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. 

పాలనపై అన్నివైపుల నుంచి అసంతృప్తి వస్తున్న నేపథ్యంలో విపక్షం దాడిని ఎదుర్కొనేందుకు మరోసారి జగన్ ఆర్థిక నేరాలనే ఆసరాగా చేసుకోవాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. అక్రమాస్తులకు జప్తు చేసేందుకు ప్రత్యేక చ‌ట్టం తీసుకురావాల‌న్న ఆలోచన కూడా ఉంది. దీన్ని తీసుకొస్తే.. చర్చ అక్రమాస్తులవైపు మల్లుతుంది కాబట్టి ఎప్పటిలాగానే.. జగన్ అక్రమాలపై చర్చ నడిపించినెట్టుకు రావచ్చన్న అభిప్రాయం కనిపిస్తోంది. సో.. మొత్తానికి ఉంది నాలుగు రోజులే అయినా హాట్ హాట్ గానే చర్చ సాగేటట్టుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: