ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది.  ఉదయం 8.30 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహా మండలి, 9గంటలకు మండలి బీఏసీ సమావేశమై రెండు సభల్లో చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేస్తాయి.ఐదు రోజులపాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదా ప్రధానాంశం కానుంది. అధికార, ప్రతిపక్షాలు అస్త్రాలతో  సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక హోదా అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ భావిస్తుంటే.. రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, ఏ అంశాన్ని లేవనెత్తినా దీటుగా జవాబు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.  

ఈ సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అవినీతిపరుల అక్రమాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందేలా చట్టసవరణ బిల్లు ఇందులో ముఖ్యమైనది. అలాగే ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించే బిల్లు, సాగునీటి సంఘాలకు ఎన్నికలు కాకుండా ఏకాభిప్రాయంతో కార్యవర్గాలను ఎంపిక చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఈ-ట్రేడింగ్‌కు అనుమతించే బిల్లులు ఇందులో ఉన్నాయి.  అంతకు ముందు ఉదయం ఏడున్నరకు సీఎం చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళు లు అర్పిస్తారు. పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు అవుతారు.

తొలి రోజున మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులు అర్పిస్తుంది సభ. ఆ తర్వాతే ప్రశ్నోత్తరాలు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఏ అంశాన్ని లేవనెత్తినా దీటుగా జవాబు చెప్పాలని అధికార పార్టీ భావిస్తోంది.  ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదా, ఓటుకు నోటు, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, ర్యాగింగ్‌- రిషితేశ్వరి ఆత్మహత్య, రైతు ఆత్మహత్యలు, కరువు, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్షం చూస్తోంది. 


ఏపీ అసెంబ్లీ

 

ఈ సమావేశాలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివాళితో ప్రారంభమవుతాయి. ప్రత్యేక హోదాపై తొలిరోజే నోటీసు ఇవ్వాలని ప్రతిపక్షం భావిస్తోంది. రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమయాన్ని వృధా చేయకుండా రెండు పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు. ఇంకోవైపు, రాజధాని భూ సమీకరణ, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆత్మహత్యలు, అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మహత్యలు వర్షాకాల సమావేశాల్లో వేడి పుట్టించబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: