వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీపై ఉన్న మమకారం అందరికీ తెలిసిందే. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే.. ఆయన అంత్యక్రియలు కూడా పూర్తికాకుండానే ముఖ్యమంత్రి పదవి దిశగా పావులు కదిపారని ఆయనపై విమర్శలున్నాయి. తన తరపున తండ్రి సన్నిహితుడు కేవీపీతో ఎమ్మెల్యేల సంతకాల సేకరణ జరిపించారని కూడా అంటుంటారు. ఏదేమైనా అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ జగన్ ను కాదని సీనియర్ నేత రోశయ్యకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. 

ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం.. ఎదిరించి సొంత పార్టీ పెట్టుకుని 2014లో అధికారం చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. అయితే తన తండ్రి తరహాలో సంక్షేమ పథకాలపై ఎక్కువ నమ్మకం పెట్టుకోలేదు. ఓవైపు బాబు రుణమాఫీ అంటే.. తానూ అదే హామీ ఇవ్వకుండా.. అది అసాధ్యమంటూ రాంగ్ స్టెప్ వేశారు. కొద్ది తేడాతోనే అధికారం చేజార్చుకున్నారు.

ప్రతిపక్షనేతగా తన పాత్ర ఓ మాదిరిగా పోషిస్తున్న జగన్.. ఇటీవల ఎక్కువగా తాను త్వరలో ముఖ్యమంత్రి అవుతానంటూ కామెంట్లు చేయడం వివాదాస్పదమవుతోంది. తనకు  ఆ విషయం ఓ స్వామీజీ చెప్పారని కూడా ఓ పత్రిక ప్రచురించింది. ప్రతిపక్షనేతగా ప్రజలను ఓదార్చేందుకు ఎక్కడకు వెళ్లినా.. నేను ముఖ్యమంత్రి అయ్యాక మీకు న్యాయం చేస్తా అంటూ మాట్లాడుతున్నారు. దీనిపై అసెంబ్లీలోనూ హాట్ డిస్కషన్ జరిగింది.

జగన్ తీరుపై చంద్రబాబు సెటైర్లు వేస్తూ.. జగన్ జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు.. నేను ముఖ్యమంత్రి అవుతాను అంటున్నారు.. రేపు మంచి రోజు వస్తుంది.. ఎల్లుండి శుభవార్త వస్తుంది అంటున్నారు.. నా సలహా ఏంటంటే.. అలాంటి పగటి కలలు కనొద్దు.. జనానికి మంచి చేయండి.. సహకరించండి.. అలాకుండా ప్రజలే మిమ్మల్ని చూసుకుంటారు.. అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు.. ఒక వేళ జగన్ జాతకం చూపించుకుంటే..ఎక్కడ చూపించుకున్నారు.. ఏం చెప్పారో చెబితే బావుంటుందని సీరియస్ గానే అన్నారు. మరి అది సెటైర్ గానే అంతా అర్థం చేసుకోవాలి కదా..



మరింత సమాచారం తెలుసుకోండి: